ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతమార్పిడిపై ఫిర్యాదు 

ప్రభుత్వ పాఠశాలలో బాలికల మతమార్పిడిపై ఫిర్యాదు 

అనంతపురం: ప్రభుత్వ పాఠశాలలో బాలికలను మతమార్పిడి చేసేందుకు ప్రయత్నంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాలలో జనవరి 3న క్రైస్తవ మత ప్రచార సభను ఏర్పాటు చేశారు. పాఠశాలలోని కొందరు ఉపాధ్యాయుల ద్వారా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ఒక క్రైస్తవ పాస్టరును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బాలికలందరినీ పాఠశాల ఆవరణలో మోకాలిపై నిలబెట్టి ప్రార్ధనలు చేయించడంతో పాటు వారిపై ఒక రకమైన నూనెను పోయడం అత్యంత వివాదాస్పదమైంది.

ఈ వ్యవహారంపై తొలుత తాడిపత్రికి చెందిన ఏబీవీపీ కార్యకర్తలు యల్లనూరు తహసీల్దారుకు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ లేవు. దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఈ వ్యవహారాన్ని జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళింది.

బాలికల భద్రతపై ఆందోళన:
ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన పరిణామాల జాతీయ బాలల హక్కుల కమిషన్ కు పంపిన ఫిర్యాదులో యల్లనూరు కస్తూరిభా బాలికల పాఠశాల, దానికి అనుబంధంగా నడుస్తున్న బాలికల వసతిగృహంలో బాలికల భద్రతపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల పాఠశాలలోకి ఒక పాస్టరును ఆహ్వానించడం, ఆ పాస్టర్ బాలికల తలపై ప్రార్ధన పేరిట ఒకరకమైన నూనె పోయడం తీవ్రమైన విషయాలు అని, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 28(3) క్రింద ఉల్లంఘనతో పాటు జువైనల్ జస్టిస్ చట్టం, మేజిక్ రెమెడీస్ చట్టాల క్రింద నేరపూరితమైన చర్య అని ఫోరమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది.ఈ ఘటనలో పాలుపంచుకున్న పాస్టర్, అతడిని పాఠశాలకు ఆహ్వానించిన వ్యక్తులతో పాటు ఏబీవీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినప్పటికీ ఉదాసీనంగా వ్యవహరించిన తహసీల్దార్ పై  కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫోరమ్ కమిషనును కోరింది.