జార్ఖండ్ వ్యక్తులతో హత్యాయత్నం … రఘురామరాజు

తనపై జార్ఖండ్ వ్యక్తులతో హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రమైన ఆరోపణ చేశారు.  అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని  ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త చంద్రయ్యను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ  వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారని ఆరోపించారు.
ఇలా ఉండగా, గత 32 నెలల్లో రాష్ట్రంలో 33 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని అంటూ ఆ పార్టీ రూపొందించిన జాబితా వెల్లడించింది.ఇందులో బలహీన వర్గాలకు చెందినవారే 20 మంది వరకూ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలవారీగా చూసినప్పుడు ఎక్కువ హత్యలు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనే జరిగాయని పేర్కొన్నారు. 
 
సినీ నటుడు చిరంజీవిని వైసీపీ తరుపున రాజ్యసభకు పంపుతున్నారంటూ ఓ ఆంగ్ల ప్రత్రికలో వచ్చిన కధనాన్ని ప్రస్తావిస్తూ  రాజ్యసభ పదవి కోసం చిరంజీవి వైసీపీలో చేరతారని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే పని చిరంజీవి చేయడని పేర్కొన్నారు.
 
సంక్రాంతి సందర్భంగా సొంత నియోజకవర్గం నరసాపురం వెళ్లాలని రఘురామ భావించిన తాను సీఐడీ నోటీసుల నేపథ్యంలో ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పారు. అంతేకాదు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.
 
కాగా, కొద్ది రోజుల క్రితం విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సైతం తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంపై పోలీసులు విచారణ కూడా జరిపారు. తాజాగా రఘురామకృష్ణ రాజు కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సంచలనమైంది.
 
కాగా, ఏపీ సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్‌కు కులం తెలియదని, కేవలం మతం మాత్రమే తెలుసునని, దాన్ని ఆయన పలు సందర్భాల్లో బహిర్గతం చేసుకున్నారని రఘురామ గుర్తు చేశారు. సునీల్‌ కుమార్ గురించి తాను వ్యక్తిగతంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేశారు. సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్‌పై తాను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్‌పై బండి సంజయ్ వ్యవహారంలో స్పందిచినంత వేగంగా స్పీకర్  స్పందించాలని కోరారు.
 
రాజ్యాంగం ప్రకారం దేవాలయాలకు, చర్చిలకు ప్రభుత్వం నిధులు ఇవ్వొద్దన్నందుకు తాను క్రైస్తవ వ్యతిరేకినా? అని ఆయన  ప్రశ్నించారు. పోలీసు వ్వస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకు వినియోగిస్తున్నారని రఘురామ విమర్శించారు.
 
ఇలా ఉండగా, జగనన్న గోరుముద్ద పథకం ఇకముందు రాష్ట్రంలో కొనసాగదని, ఈ విషయంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాను రాసిన లేఖకు స్పందించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరని, ఇతర మంత్రిత్వశాఖలు కూడా మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ బాటలో కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.