కేసీఆర్ కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది

కేసీఆర్‎కు బుద్ధి చెప్పాల్సిన సమయం, ఆయనను గద్దె దింపాల్సిన సమయం వచ్చిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ పిలుపిచ్చారు. మహబూబ్ నగర్ లో 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగలో మాట్లాడుతూ ప్రశ్నించే వారిని భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.   
 
నియంత కేసీఆర్ చేష్టలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనని ఆమె చెప్పారు. అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సకల జనుల సమ్మెలో అందరూ పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఆ ఫలాలను మాత్రం కేసీఆర్ కుటుంబమే తింటోందని ఆమే మండిపడ్డారు.
 
కేసీఆర్ తీరు వల్లే జీవో 317కు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి వస్తోందని ఆమె విమర్శించారు. ఈ జీవో వల్ల ఇప్పటికే 9 మంది టీచర్లు చనిపోయారని, అయినా కేసీఆర్‎లో మాత్రం ఎటువంటి చలనం రాలేదని ఆమె దుయ్యబట్టారు. టీచర్లకు బీజేపీ అండగా ఉంటుందని చెబుతూ బీజేపీ అధికారంలోకి వచ్చేది ఖాయం.. జీవో 317ను సవరించేది ఖాయం అని ఆమె భరోసా వ్యక్తం చేశారు. ఇంకొంత కాలం ఈ కష్టాన్ని భరించండని ఆమె కోరారు. 
 
ఈ నియంత ప్రజల మనిషి కాదు. కుటుంబం కోసమే రాజ్యమేలుతున్నడు తప్ప ప్రజల కోసం కాదని అరుణ స్పష్టం చేశారు. 317 జీవోను సవరించేదాకా బిజెపి  పోరాటం సాగుతుందని ఆమె హామీ ఇచ్చారు. కాళేశ్వరంతో తెలంగాణలోని నలుమూలలకు నీళ్లు ఇస్తానన్నారు. పాలమూరులోకి కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? అని ఆమె ప్రశ్నించారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‎లో అవినీతి చేయలేదని యాదాద్రి ప్రారంభోత్సవంలో నరసింహ స్వామి మీద ఒట్టేయగలడా? అని అరుణ సవాల్ చేశారు. 
 
కేసీఆర్ ను దించడమే లక్ష్యం 
 
ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్నోళ్లెవ్వరూ బాగుపడలేదని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆలంపూర్ నుంచి అదిలాబాద్ దాకా ఒకటే నినాదం ఉందని.. సీఎం కేసీఆర్ ను దించడమే లక్ష్యమని అని పేర్కొన్నారు. రైతు ఉత్సవాల్లో ఒక్కరు లేరని.. కేసీఆర్ వెంట ఏ కులం, ఏ వర్గం లేదని ఆయన చెప్పారు. 
 
ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకున్నారని.. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని పాతర వేస్తారని స్పష్టం చేశారు. తమకు అండగా ఉన్న వారిని వేధిస్తున్నారన్నారని అంటూ మీ ఆటలు ఎన్ని రోజులు సాగుతాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ది ఆరిపోయే దీపం అని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ లో ఎట్లా చెంప చెళ్లుమనిపించినరో.. మొత్తం తెలంగాణాలో కూడా మిమ్మల్ని బొంద పెడతారన్నారని వెల్లడించారు.
పాలమూరు ఎప్పటికీ బీజేపీకి అండగా ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో 14 సీట్లల్లో బీజేపీని గెలిపిస్తారన్నారని ఆయన భరోసా వ్యక్తం చేశారు. రైతులను వరి పంట వేయొద్దంటున్న కేసీఆర్‌ మరి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలి? అని ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.   కేసీఆర్ కు బేడీలు వేసి హెలికాప్టర్లో రాష్ట్రమంతా తిప్పుతామని వెల్లడించారు.  సీఎం కేసీఆర్ అవినీతిపై తప్పకుండా విచారణ చేస్తామని పేర్కొంటూ   ఆయన అవినీతిపై విచారణ చేస్తామని తెలిసే ధర్డ్ ఫ్రంట్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నాడన్నారని ఎద్దేవా చేశారు.
 తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో కేసీఆర్ కలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో 24 గంటలు దీక్ష చేస్తానన్న కేసీఆర్.. రాష్ట్రంలో నాలుగు గంటలు చేసిన తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని విమర్శించారు. 317 జీవోను సవరించే వరకు పోరాటం చేస్తామని చెబుతూ  317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.