ఉస్మానియా, కాకతీయ వైద్య కళాశాలల్లో కరోనా ప్రతాపం 

ఉస్మానియా వైద్య కశాశాలలో 24 మంది వైద్య విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. దాదాపు 200 మందికిపైగా ఉండే ఒక్కో హాస్టల్‌లో 12 మంది చొప్పున కరోనా బారినపడడంతో మిగిలిన వైద్య విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మిగిలిన విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు.  
 
మరోవైపు గత వారం రోజులుగా నర్సింగ్‌ విద్యార్థులకు ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మరో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గాంధీలో 10మంది హౌస్‌ సర్జన్ల కు పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడ 52 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. 
 
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 42కు చేరాయి. నిన్న ప్రిన్సిపాల్ మోహన్ దాస్ సహా 26 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈరోజు పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. దీంతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.
 
తెలంగాణలో కొత్తగా 1825 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. వైర్‌సతో మరొకరు చనిపోయారు. ప్రస్తుతం 14,995 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక హైదరాబాద్‌లో 1042, మేడ్చల్‌లో 201, రంగారెడ్డిలో 147, సంగారెడి 51, హన్మకొండలో 47 కేసులు నమోదయ్యాయి. 
 
మంచిర్యాల జిల్లాలో 93 మందికి, పెద్దపల్లిలో 63 మందికి, కరీంనగర్‌ లో 58 మందికి, జగిత్యాలలో ఎనిమిది మందికి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి, ఖమ్మంలో ఏడుగురికి, మధిర తహసీల్‌లో ఏడుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతా్‌పసింగ్‌ వైరస్‌ బారినపడ్డారు.
 
రాష్ట్రంలో సోమవారం ముందుజాగ్రత్త (ప్రికాషనరీ) వ్యాక్సిన్‌ డోసు ఇవ్వడం ప్రారంభమైంది. తొలి రోజు 22045 మందికి దీన్ని ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని చార్మినార్‌ వద్దనున్న ప్రభుత్వ యునానీ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.