బదిలీ చేసారిని ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్య 

తెలంగాణలో 317 జీవో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రాణాలు తీస్తోంది. ఒక జిల్లాలో పుట్టి, పెరిగి అక్కడే ఉద్యోగం చేస్తున్నవారిని మరో జిల్లాకు బదిలీ చేస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను జీర్ణించుకోలేక, బలవంతపు బదిలీలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
దూర భారం భరించలేక ఉసురు తీసుకుంటున్నారు. బదిలీలను తట్టుకోలేక ఆదివారం ఒక్క రోజే ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడగా, మరో ఉపధ్యాయురాలి గుండె ఆగింది. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాద్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. భీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన టీచర్ సరస్వతి ఇంట్లో  ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది.
భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న సరస్వతికి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలోని నిబంధనల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయింది. దూర ప్రాంతానికి బదిలీ కావడంతో మనస్తాపం చెందిన సరస్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
అలాగే బదిలీని తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లాలో మరో టీచర్ గుండె ఆగింది. మరిపెడ మండలం, పూజల తండాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు పుల్యాల శ్రీమతికి 317 జీవో కారణంగా ములుగు జిల్లాకు బదిలీ అయింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురికావడంతో గుండెపోటు వచ్చింది. 317 జీవోనే శ్రీమతి ప్రాణాలు తీసిందని ఆమె బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
317జీవోతో మరో నిండు ప్రాణం బలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బేతల సరస్వతి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందని ఆయన పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
317 జీవో తో  నష్టపోయిన మరో బాధితురాలు బలవన్మరణానికి పాల్పడడం.. ఇవన్నీ కేసీఆర్ చేసిన హత్యలేనని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని, వారి తరపున తాము పోరాడుతున్నామని ఆయన హామీ ఇచ్చారు.
సరైన సంప్రదింపులు చేయకుండా, విధి విధానాలు తెలుపకుండా ప్రభుత్వం ఉద్యోగులను ప్రభుత్వం అయోమయంలో పడేసిందని బిజెపి ఎంపీ డి అర్వింద్ ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల ఉసురు తీస్తున్న జీవో317 ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. eజీవో వెనక్కి తీసుకొని, సవరణలు చేపట్టకపోతే ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్థులెవరూ మనోబలం కోల్పోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.