దేశంలో 4 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ ఒక్క రోజులో లక్షా 79 వేల 723 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
 
ఇందులో మహారాష్ట్ర నుంచే 44 వేల 388, యూపీలో 7 వేల 695, ఢిల్లీలో 27 వేల 75 కేసులు ఉన్నాయి. నిన్నటి కంటే 12.5 శాతం కేసులు పెరిగాయి. డైలీ పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. ఆదివారం 146 మంది వైరస్ కారణంగా చనిపోగా.. 46 వేల 569 మంది కోలుకున్నారు. 
 
దేశంలో ప్రస్తుతం 7లక్షల 23వేల 619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 4 వేల మార్క్ దాటాయి. తాజాగా 4,033 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు భారీగా తగ్గడం కాస్త ఊరట కలిగిస్తోంది. 
 
కేసులు పెరుగుతున్నా వైరస్ తీవ్రత తక్కువగానే ఉందంటున్నారు నిపుణులు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దని.. మస్ట్‎గా కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా టెస్టు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
 
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో అదనపు పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్‌తో పాటు 150 మంది పోలీసులకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పోలీసులు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. 
 
ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంటు అథారిటీ సోమవారం సమావేశం కానుంది. మొత్తం కర్ఫ్యూతో పాటు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏజెండాతో కరోనా పరిస్థితిపై చర్చించనున్నట్లు సమాచారం. ఆదివారం ఒక్కరోజే 22,751 మందికి కరోనా సోకింది. 
.