వామపక్షాలతో పొత్తుకు కేసీఆర్ ఆరాటం!

రాజకీయంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో
రాష్ట్రంలో బిజెపి నుండి ఎదురవుతున్న రాజకీయ సవాల్ ను ఎదుర్కోవడం కోసం టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దిక్కుతోచని స్థితిలో వామపక్షాలతో సయోధ్యకు కసరత్తు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. 
 
తమ పార్టీల సమావేశాలకు హాజరు కావడానికి హైదరాబాద్ వచ్చిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలను ప్రగత్ భవన్ కు ఆహ్వానించి, వారితో `బిజెపి ముక్త భారత్’ గురించి సుదీర్ఘ సమాలోచనలు జరిపినట్లు మీడియా కు లీక్ చేశారు. అయితే ఈ విషయమై కమ్యూనిస్ట్ పార్టీల నేతలు మాత్రం బహిరంగంగా స్పందించక పోవడం గమనార్హం. 
సిపిఎం నేతలకైతే ముఖ్యమంత్రి విందు ఇచ్చారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ తదితరులతో మంతనాలు జరిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపైననే వారి సమ్లోలోచనలు జరిగిన్నట్లు కనిపిస్తున్నది.
అయితే ఈ భేటీకి రాష్ట్ర సిపిఎం నాయకులు ఎవ్వరు హాజరు కాకపోవడం గమనార్హం. కేసీఆర్ తో కలిసిన్నట్లు సంకేతం వెడితే ప్రజలలో ప్రతికూల స్పందనలు ఎదురు కాగలవని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భయపడుతున్నారా?  ఏచూరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సహితం సన్నిహితుడు కావడం గమనార్హం.  బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో నేరుగా చేతులు కలపలేక కేసీఆర్ ఏచూరిను ఎంచుకున్నారా?
మరోవంక,  సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత బినయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా కేసీఆర్‌తో ఆ తర్వాత విడిగా సమావేశమయ్యారు.
ప్రస్తుతం రెండు కమ్యూనిస్ట్ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలలో తమ రాజకీయ ఉనికి కోసం ఆరాట పడుతున్నాయి. రెండు రాష్ట్రాల శాసనసభలలో వారికి ప్రాతినిధ్యం లేవు. జాతీయ స్థాయిలో సహితం సిపిఐ ఉనికి ప్రశ్నార్ధకరమే. సిపిఎం సహితం కేరళకు పరిమితమయింది. అటువంటి పార్టీలతో చేతులు కలపడం ద్వారా కేసీఆర్ రాజకీయంగా సాధించే ప్రయోజనం సందేహాస్పదమే.
పైగా, జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి గతంలో ప్రయత్నాలు చేశారు. అందులో కాంగ్రెస్ కు స్థానం లేదని ఆమె స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు.
పైగా, గత దశాబ్దకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ లతో పొత్తుకు ఏ పార్టీ ముందు రావడం లేదు. కేసీఆర్ సహితం ఆ పార్టీ నాయకులను ఎప్పుడు పట్టించుకోలేదు. కొంతకాలంగా సిపిఎం సానుకూల సంకేతాలు పంపుతున్నా కేసీఆర్ స్పందించడం లేదు. అటువంటి పార్టీలతో కేసీఆర్ భేటీ సాధించే ప్రయోజనం కనిపించదు.