సంజయ్ కు ప్రధాని ఫోన్.. అండగా ఉంటామని భరోసా

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ వచ్చింది. దాదాపు 15 నిముషాల సేపు మాట్లాడి ఆయ్హన పోరాట పటిమను మెచ్చుకున్నారు. తెలంగాణ  రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. 
 
ఈనెల రెండవ తేదీన జగ జాగరణ దీక్ష తదనంతరం జరిగిన పరిస్థితులను మోదీకి  సంజయ్ వివరించారు. మోదీని రాష్ట్రానికి రావాలని సంజయ్ ఆహ్వానించారు. “మీ ఆశీర్వాదంతో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తాము” అంటూ మోదీకి సంజయ్ హామీ ఇచ్చారు. 
 
కాగా,   317 జీవోపై మోదీ ఆరా తీశారు. వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణాలు ఏంటని  మోదీ ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను  మోదీ  ప్రస్తావించాడు. ప్రజాసమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్ళిన తప్పులేదని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎంపీ కార్యాలయంపై దాడిని మోదీ ఖండించారు. కార్యాలయంలోకి వచ్చి ఎలా దాడిచేస్తారని ఆరా‌ తీశారు. సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయాలపా‌లైన కార్యకర్తలకు అండగా ఉందామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని, మీకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని సంజయ్ కు హామీ ఇచ్చారు.
 
ఇప్పటికే సంజయ్‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పరామర్శించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  రాష్ట్రానికి వచ్చి సంజయ్‌ని పరామర్శించారు. సంజయ్‌కి  జాతీయ నాయకత్వం పూర్తి మద్దుతుగా నిలిచింది. కేసీఆర్‌పై పోరు కొనసాగించటానికి  జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.