కాశీలో హిందువులు కానివారు రావద్దన్న పోస్టర్లపై కలకలం

హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపాయి. పైగా, వీటిపై విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్ పేర్లు ఉండడం రాజకీయంగా దుమారం రేపాయి. 
 
అయితే  ఆ పోస్టర్లతో తమకు సంబంధం లేదని ఆ రెండు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. తగు విచారణ జరిపి దోషులెవ్వరో కనుక్కోవాలని కోరారు. 
 
దీనిపై విచారణ జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషద్ జాతీయ అధికార ప్రతినిధి  వినోద్‌ బన్సాల్‌ స్పష్టం చేశారు. కాగా, ఈ పోస్టర్ల సందేశాన్ని వినిపిస్తూ ఇద్దరు వ్యక్తులతో వీడియోలు సహితం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి. 
 

ఆ ఇద్దరు వ్యక్తులు ఎవ్వరో ఇంకా గుర్తింపలేదు. కాశీ (వారణాసి) అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పాండే మాట్లాడుతూ, “మేము ఆ పోస్టర్లు వేసిన వ్యక్తులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. వారిపై తగు చర్యలు తీసుకుంటాము. అన్ని పోస్టర్లు తొలగించాము” అని చెప్పారు.

“కొంతమంది లైమ్‌లైట్ పొందడానికి తప్పుడు, అపరిపక్వమైన చర్యలు తీసుకుంటారు. మేము అలాంటి చర్యలను ఆమోదించము” అని మరో విశ్వహిందూ పరిషద్ నేత స్పష్టం చేశారు. 

 
‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్‌ స్పాట్‌ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు.
 
వీటిపై  హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. భేల్‌పూర్‌ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామని పేర్కొన్నారు. 
 
అయితే, హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ హెచ్చరిక ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేశారని ఆరోపణలు చెలరేగుతున్నాయి. 
 
ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడడంతో, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని భజరంగ్ దళ్ నేత నిఖిల్‌ త్రిపాఠీ  హెచ్చరించారు.