మహేష్‌బాబు, మంత్రి హరీశ్‌రావులకు కరోనా పాజిటివ్

తెలంగాణలో వరుసగా మూడో రోజూ కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి. గురువారం ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావులు కరోనా బారినపడ్డారు. వీరికి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే ఐసోలేట్ అయ్యారు. 

తమతో కాంటాక్ట్ అయిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హీరో మహేష్‌బాబు, మంత్రి హరీశ్‌రావులు కోరారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. 

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,036కు చేరింది. తాజాగా కరోనా నుంచి 232 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,75,573 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.27 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వరంగల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో కరోనా కలకలం రేపింది.  నిట్‌లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 16 వరకు కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ వచ్చిన.. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.