తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలి

తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలి

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఆసరాగా తీసుకొని  తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టడంలో నేతలు సఫలీకృతం అవుతున్నారని, మరోవైపు టీఆర్‌ఎస్‌పై ప్రజాగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో వచ్చే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి మహేశ్వరం మండలంలోని మాక్‌ ప్రాజెక్ట్‌లో పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో.. బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఇతర నాయకులను నడ్డా అభినందించారు.  

 ‘మీ పోరాటం ప్రజల కోసం ఉండాలి.. టిక్కెట్ల కోసం కాదు. పాతవారు, కొత్తవారు కలిసి పనిచేయండి. మీకు అండగా జాతీయనాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంది’ అని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు కొనసాగించాలని, ఏ దశలోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. 

వివిధ వర్గాల ప్రజల సమస్యలు, అంశాలపై మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి బీజేపీకి అనుకూలంగా మద్దతు కూడగట్టాలని  నడ్డా సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనపై పట్టుకోల్పోవడంతోపాటు హామీల అమల్లో వైఫల్యం చెందిందని, దీనిని జీర్ణించుకోలేకే ఆ పార్టీ పెద్దలు సంయమనం, గౌరవ మర్యాదలు కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు.  

బండి సంజయ్‌ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పార్టీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన జాతీయ పార్టీకి, ముఖ్యంగా జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గొప్ప ఉద్యమంలో రాష్ట్ర నాయకులు కూడా అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇకముందు కూడా టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో కలిసికట్టుగా ముందుకెళదామని పిలుపునిచ్చారు. 

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం డాక్టర్‌ రమణ్‌సింగ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, పార్టీ నేతలు డాక్టర్‌ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్‌ జి.వివేక్‌ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, రాజాసింగ్  తదితరులు హాజరయ్యారు.    

టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభం
 
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ స్పష్టం చేశారు .  ఆయన కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను కలిసి ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. 
 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎంపీ కార్యాలయంపై దాడిచేసి తాళాలు పగులగొట్టి లోపల ఉన్న బండి సంజయ్‌ సహా కార్యకర్తలపై విక్షచణ రహితంగా లాఠీచార్జీ చేయడమే కాకుండా దొంగల్లా సీసీపుటేజీలను ఎత్తుకెళ్లారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కార్యకర్తలు, మహిళలు అని చూడకుండా లాఠీచార్జ్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు.  భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద రాజకీయ దుర్ఘటన చూడలేదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు అర్హత లేదని రమణ్‌సింగ్‌ స్పష్టం చేశారు.  
అమిత్‌ షాకు ఫిర్యాదు చేస్తాం 
తెలంగాణలో అరాచక, నియంత పాలనను అంతమొందించేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్‌ జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్‌, కచ్చు రవి, పలువురు నాయకులను ఆయన పరామర్శించారు.
బీజేపీ అధ్యక్షుడు, నాయకులపై జరిగిన దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు, రాష్ట్ర గవర్నర్‌, మహిళా కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. 317 జీవో సవరించే వరకు బీజేపీ పోరాటం ఆగదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు.