అంతర్జాతీయ సైనిక సంక్షోభాలలో భారత్ కీలక పాత్ర పోషించి, వాటిని పరిష్కరించే సమయమూ రావచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా పశ్చిమాసియా సంక్షోభం సహా పలు అంతర్జాతీయ ఘర్షణలను నిలువరించడానికి భారత్ తనవంతు ప్రయత్నాలు చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రయత్నాల ఫలితాలు అనేవి సమయం, ప్రపంచ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.
ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ ఘర్షణలోనూ యుద్ధాన్ని ముగించాలని ఇరుపక్షాలను భారత ప్రధాని మోదీ కోరారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. దౌత్య వ్యవహారాల్లో ప్రధాని మోదీ సమతూకంతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. బుధవారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొంటూ భారత దౌత్య ప్రయత్నాల ప్రభావం వల్లే పెద్ద సంఖ్యలో భారతీయ నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి వచ్చాయని చెప్పారు.
సైనిక సంక్షోభం టైంలోనూ 7 నుంచి 8 నౌకలను హర్మూజ్ దాటించడం అనేది కేవలం భారత దౌత్యపు ఘనత అని ఆయన కొనియాడారు. ఇతర దేశాల నౌకలేవీ ఆ అవకాశాన్ని పొందలేకపోయాయని రాజ్‌నాథ్ తెలిపారు. అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో తటస్థంగా, సమతూకంగా వ్యవహరించడమే భారత్ వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల భారత్‌ను అటు అమెరికా కానీ, ఇటు ఇరాన్ కానీ శత్రువుగా పరిగణించే అవకాశాలే ఉండవని తేల్చి చెప్పారు.
ప్రపంచంలో ప్రధాన సైనిక ఘర్షణలు జరుగుతున్న దేశాల ప్రభుత్వాధినేతలతో ప్రధాని మోదీ వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపారని, శాంతియత్నాలకు పెద్దపీట వేయాలని సూచించారని రాజ్‌నాథ్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లను నేరుగా కలిసిన సందర్భాల్లోనూ ఇదే అంశాన్ని మోదీ ప్రస్తావించారని తెలిపారు. శాంతి, చర్చల మార్గంలోనే సంక్షోభాలకు పరిష్కారం లభిస్తుందనే గొప్ప సందేశాన్ని భారత ప్రధాని వ్యాప్తి చేశారని ఆయన పేర్కొన్నారు.
“నేను జర్మనీలో పర్యటించడం ఇదే తొలిసారి. జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఆహ్వానం మేరకు బెర్లిన్‌కు వచ్చాను. భారత్, జర్మనీల అనుబంధం క్రమంగా చాలా బలోపేతమైంది. ఈ ఏడాది మాకు ప్రత్యేకం. ఎందుకంటే ఇరుదేశాల దౌత్య సంబంధాలకు పునాది పడి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజాస్వామిక విలువల పునాదిపై ఇరుదేశాల సంబంధాలు నిలిచి ఉన్నాయి” అని రక్షణ మంత్రి చెప్పారు.
“భారత్, జర్మనీ మధ్య వాణిజ్యపరమైన భాగస్వామ్యం కూడా ఉంది. పలు రంగాల్లో ఇరుదేశాల పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. నేడు ఐరోపా ఖండంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ ఉంది. భారత్‌లో 2వేలకుపైగా జర్మనీ కంపెనీలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. భారత దేశ పారిశ్రామిక వికాసానికి, మేకిన్ ఇండియా మిషన్‌కు జర్మనీ కంపెనీలు ఊతంగా నిలుస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జర్మనీలోనూ భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి” అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

More Stories
మతాచారాలకు ప్రమాణాలను నిర్వచించడం కష్టమే!
పహల్గమ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు