పంజాబ్ లో ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయిన ప్రధాని

పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నిరసనకారులు రహదారులను దిగ్బంధనం చేసిన కారణంగా ఒక ఫ్లై ఓవర్ పై కొద్దిసేపు ఆగిపోవలసి వచ్చింది. దానితో తన కార్యక్రమాలను రద్దుచేసుకొని, వెనుతిరిగారు. ఆందోళనకారులు నిరసన చేపట్టడంతో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్పై చిక్కుకుపోయింది. పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. ‘ప్రాణాలతో బటిండా విమానాశ్రయానికి చేరుకున్నా. మీ ముఖ్యమంత్రికి థాంక్స్” అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులతో అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.
పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని హుస్సేనీవాలాలోని అమరవీరుల స్మారకాన్ని వద్ద నివాళులర్పించేందుకు భఠిండాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా స్మారకం వద్దకు చేరుకోవాల్సి ఉండగా. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో బయలుదేరారు.
ఈ మేరకు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ అధికారులు పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారం అందించారు. అయితే మార్గమధ్యంలో ప్రధాని కాన్వాయ్ ఓ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకోగానే కొందరు నిరసనకారులు ఆందోళనకు దిగారు.
ఆందోళనకారులు కాన్వాయ్ను అడ్డుకోవడంతో ప్రధాని మోడీ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుపోయారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఫలితంగా ప్రధాని కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఇదిలావుండగా, ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్‌పీని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 
ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే ప్రధాని పర్యటన రద్దైందని మండిపడింది. దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం వెల్లడికావడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తుందని అందరికీ తెలుసునన్నారు. భారత దేశ ప్రధాన మంత్రికి హాని చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోదీ బుధవారంనాడు పాల్గొనాల్సిన ఫిరోజ్‌పూర్ ర్యాలీకి వర్షం అవాంతరం కలిగించింది. ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా ప్రధాని ర్యాలీ రద్దయింది. ప్రధాని భటిండా నుంచి ఫిరోజ్‌పూర్ బయలుదేరిన సమయలో వర్షం పడటంతో ఆయన రాక కోసం సభాస్థలిలో ఎదురుచూస్తున్న జనం చెల్లాచెదురయ్యారు.
కుర్చీలు, బీజేపీ నేతల కటౌట్లు తీసుకుని తలకు అడ్డుపెట్టుకోవడం కనిపించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత ప్రధాని ర్యాలీ రద్దయినట్టు తెలియడం, వర్షం కూడా పడటంతో జనం సభాస్థలి నుంచి వెనక్కి మళ్లారు.
కాగా, ప్రధాని  పర్యటన రద్దుపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని స్పష్టం చేశారు.  ముందుగా హెలికాప్టర్లో వెళ్లాలని నిర్ణయించిన మోదీ, చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.  తాను మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాని పాల్గొనే కార్యక్రమ భద్రతా చర్యలను సమీక్షించానని పేర్కొన్నారు.