20 ఏళ్ళల్లో యుద్దాలపై అమెరికా ఖర్చు 14 లక్షల కోట్ల డాలర్లు 

అంతర్జాతీయంగా పలు చోట్ల నెలకొన్న ఘర్షణలు, జరిగిన యుద్దాలు వెనుక కార్పొరేట్ శక్తుల ప్రచ్ఛన్న హస్తం ఉన్నట్లు వెల్లడవుతుంది. ముఖ్యంగా అమెరికా, ఇతర అగ్రరాజ్యాల కేంద్రంగా పనిచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు ఇటువంటి యుద్ధాల కారణంగా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండటం విస్మయం కలిగిస్తుంది. 
 
ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ప్రాచ్యంలో గత రెండు దశాబ్దాలుగా సాగించిన యుద్ధాలలో అమెరికా సైనికంగా 14 లక్షల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టింది. వదానితో వీటి వల్లా ఎక్కువగా ప్రయోజనం పొందినది తమ సంపదను పెంచుకున్న  ఆయుధాల తయారీదారులు, డీలర్లు, కాంట్రాక్టర్లు మాత్రమే అని పలు నివేదికలు స్పష్టము చేస్తున్నాయి. 
 
ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ప్రచురితమైన సవివరమైన నివేదికలో విస్మయం కలిగించే పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2001 సెప్టెంబరు 11నుండి అమెరికన్‌ మిలటరీ ఔట్‌సోర్సింగ్‌తో పెంటగన్‌ వ్యయం 14లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ మొత్తంలో మూడో వంతు నుంచి సగం వరకు కాంట్రాక్టర్లకే వెళ్లింది. 
 
ఎన్నడూ సాకారమవని, విజయవంతమవని ప్రాజెక్టులపై అమెరికా పెద్ద ఎత్తున వృద్ధ వ్యయం చేస్తున్నట్లు తేలింది.  ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్‌లోని కెష్మెర మార్కెట్‌ను పెంపొందించేందుకు తొమ్మిది ఇటలీ గొర్రెలను దిగుమతి చేసుకునే ప్రాజెక్టుపై పెంటగన్‌ ఏకంగా 60లక్షల డాలర్లను ఖర్చు పెట్టింది. ఆ ప్రాజెక్టు ఎన్నడూ ఆ స్థాయిని అందుకోలేదు. 
 
లాక్‌హీడ్‌ మార్టిన్‌ కార్పొరేషన్‌, బోయింగ్‌ కంపెనీ, జనరల్‌ డైనమిక్స్‌ కార్పొరేషన్‌, రేథాన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌, నార్త్‌రోప్‌ గ్రుమ్మన్‌ కార్పొరేషన్‌ ఈ ఐదు రక్షణ రంగ కంపెనీలు ఆయుధాలు, సరఫరాలు, ఇతర సేవల కోసం సింహ భాగాన్ని అంటే 2.1లక్షల కోట్ల డాలర్లు తీసుకున్నాయి. 
 
బ్రౌన్‌ యూనివర్శిటీకి చెందిన కాస్ట్స్‌ ఆఫ్‌ వార్‌ ప్రాజెక్ట్‌్‌, ఏరియా స్కాలర్లు, న్యాయ నిపుణులు, ఇతరుల నుంచి ఈ వార్తా పత్రిక డేటాను సేకరించింది. అమెరికా జరిపిన యుద్ధాల కారణంగా అతి బీదరికం నుంచి సుసంపన్నులైన వారి కొన్ని కథనాలను కూడా ఈ నివేదిక ఇచ్చింది. 
 
సైనిక బలగాలకు దుప్పట్లు అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆఫ్ఘన్‌ యువకుడు అనతికాలంలోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలు రంగాలకు విస్తరించాడు. టివి స్టేషన్‌, దేశీయ ఎయిర్‌లైన్స్‌ వంటి సంస్థలను స్థాపించాడు. 
 
ఇంధన వ్యాపారం ప్రారంభించిన కాలిఫోర్నియా వ్యాపారి కోట్లాది డాలర్లు ఆదాయంగా పొందాడు. ఓహియోకి చెందిన ఇద్దరు సైనిక గార్డులు అమెరికన్‌ సైన్యానికి ఆఫ్ఘన్‌ ఇంటర్‌ప్రెటెర్స్‌ (భాష్యం చెప్పేవారు) సేవలను అందజేసే చిన్న వ్యాపారం మొదలు పెట్టారు. 
 
ఈనాడు వారు అమెరికా సైన్యంలోనే అతిపెద్ద కాంట్రాక్టర్లలో ఒకరిగా పేరొందారు. దాదాపు 400 కోట్ల డాలర్లు విలువ చేసే కాంట్రాక్టులను పొందారు. ఈ నివేదిక అమెరికా ప్రభుత్వానికే విస్మయం కలిగించింది. 
 
యుద్ధరంగ కాంట్రాక్టర్లపై ఆధారపడడం వల్ల యుద్ధ వ్యయం ఏ రకంగా పలు రెట్లు పెరిగిందో నిర్ధారించేందుకు బైడెన్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వృథా అయిన మొత్తాలు, అవినీతి వ్యవహారాలపై వందలాది నివేదికలను సిగార్‌ (ఆఫ్ఘన్‌ పునర్నిర్మాణంపై అమెరికా స్పెషల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌) సేకరించింది.