వైష్ణోదేవి మందిరం వద్ద తొక్కిసలాట:12మంది మృతి

కొత్త సంవత్సరం వేళ శనివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీరులోని వైష్ణోదేవి ఆలయంలో విషాదం అలముకుంది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లా కత్రాలోని మాతా వైష్ణో‌దేవి మందిరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించగా మరికొంతమంది భక్తులు గాయపడ్డారు.
 
క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించారు. వైష్ణోదేవి భవన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘మృతుల సంఖ్యపై కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియ లేదు మృతదేహాల పోస్ట్ మార్టం అవుతోంది’’ అని డాక్టర్ గోపాల్ చెప్పారు. 

గాయపడిన వారి సంఖ్య కూడా ధృవీకరించలేదని డాక్టర్ దత్ చెప్పారు. క్షతగాత్రులను నరైనా ఆసుపత్రికి తరలించారు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.

వైష్ణోదేవి మందిరంలో భక్తుల రద్దీ పెరిగింది.భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట జరిగింది. గాయపడిన భక్తులకు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  

జమ్మూకశ్మీర్‌ వైష్ణోదేవీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.తొక్కిసలాటలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయాన్ని ప్రధాని ప్రకటించారు.

జమ్మూకశ్మీర్‌: తొక్కిసలాట మృతులు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ 2 లక్షలు చొప్పును ఎక్స్‌గ్రేషియో ఇస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రకారు.

ఈ ఘటనపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి  నేతృత్వంలో అత్యున్నత స్థాయి విచారణకు  ఆదేశించినట్లు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ఈ కమిటీలో జమ్ము ఏడీజీపీ, జమ్ము డివిజినల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ ఘటన గురించి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు వివరించామని పేర్కొన్నారు.