మహారాష్ట్రలో 10 మంది మంత్రులకు కరోనా … లాక్‌డౌన్ !

మహారాష్ట్రలో ఇప్పటివరకు 10 మందికి పైగా మంత్రులు,20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలిందని, రాష్ట్రంలో కరోనా  కేసులు పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. మహారాష్ట్రలో తాజాగా 8,067 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ఒక రోజు తర్వాత అజిత్ పవార్ హెచ్చరిక జారీ చేశారు.

మహారాష్ట్రలో గురువారం కంటే 50 శాతం ఎక్కువ కేసులు నమోదైనాయి.‘‘మేం ఇటీవల అసెంబ్లీ సమావేశాల తేదీలను తగ్గించాం. ఇప్పటివరకు, 10 మందికి పైగా మంత్రులు,  20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను ప్రకటించాయి, మహారాష్ట్రలో, ముంబై, పూణేలలో కేసులు పెరుగుతున్నాయి’’ అని అజిత్ పవార్ పెర్నే గ్రామంలోని జయస్తంభ్ సైనిక స్మారకాన్ని సందర్శించిన తర్వాత విలేకరులతో చెప్పారు.

రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు  విధిస్తామనిన స్పష్టం చేశారు.  కరోనాను నివారించడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలని మంత్రి కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎద్దుల బండ్ల పందాలకు అనుమతి నిరాకరించింది. మరోమారు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు బహిరంగ సభలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి  జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.

మహారాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 8,067 కొవిడ్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో త్వరలో లాక్‌డౌన్ విధిస్తారా అంటే అవునంటున్నారు మహారాష్ట్ర మంత్రి. మహారాష్ట్రంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించే దశ సమీపిస్తుందని రాష్ట్ర మంత్రి విజయ్ వాడెట్టివార్ చెప్పారు. 
 
గత 24 గంటల్లోనే మహారాష్ట్రంలో అనూహ్యంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ‘‘మహారాష్ట్రలో లాక్‌డౌన్ దశ సమీపిస్తోంది. అయితే లాక్‌డౌన్ ఎప్పుడు విధించాలనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు’’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ మంత్రి వాడేట్టివార్‌ చెప్పారు.ప్రయాణాలు, కళాశాలలపై ఆంక్షలు విధిస్తామని మంత్రి తెలిపారు.
 
మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 66,78,821కి పెరగ్గా,1,41,526మంది మరణించారు.మహారాష్ట్రలో 24,509 యాక్టివ్ కేసులున్నాయి.మహారాష్ట్రలో 454 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి.జనవరి 3వ వారం నాటికి మహారాష్ట్రలో 2 లక్షల యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యే అవకాశముందని మహారాష్ట్ర అదనపు చీఫ్ హెల్త్ సెక్రటరీ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు,అంత్యక్రియలకు హాజరుపై కొత్త ఆంక్షలను ప్రకటించింది.
 
మరోవంక, భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్నటి వరకూ 10 వేల లోపే ఉన్న కరోనా కేసులు.. నిన్న 20 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,949 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 406 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 1,431కి చేరింది.