వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి పెంపు వాయిదా

దేశంలోని వస్త్ర పరిశ్రమపై వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి పెంచాలన్న ప్రతిపాదనలపై జిఎస్‌టి మండలి వెనక్కి తగ్గింది. జిఎస్‌టి కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సమావేశం  జిఎస్‌టి పెంచాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. 
 
వచ్చే జిఎస్‌టి మండలి సమావేశంలో ఈ విషయంపై అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపింది. చేనేత, జౌళిపై జిఎస్‌టిని 5 నుండి 12 శాతానికి పెంచాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో వాయిదా పడనుంది. 
 
వస్త్ర పరిశ్రమపై కేంద్రం విధించిన 12 శాతం జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ.. డిసెంబరు 30న దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. సీతారామన్‌ ఇటీవల పలు రాష్ట్రాలతో జరిపిన బడ్జెట్‌ ముందస్తు సమావేశాల్లోనూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.

అఖిలేష్ కు వణుకు పుట్టిస్తున్నాయా?

పెర్ఫ్‌ఫ్యూమ్ తయారీదారు పుష్పరాజ్‌ జైన్‌పై యూపీలో ఐటీ అధికారులు జరిపిన దాడిని సకాలంలో జరిగిన దాడులుగా కేంద్ర  నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఆదాయం పన్ను శాఖ ప్రొఫనలిజంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అనుమానాలు వ్యక్తం చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా స్పందించారు. 

ఈ దాడులు ఆయనకు వణుకుపుట్టిస్తున్నాయా? భయపడుతున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలు పెద్దఎత్తున మేట వేసుకున్నట్టు కనిపించడం చూస్తే ”లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు” ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుందని ఆమె పేర్కొన్నారు. 

”ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఆగి, ముహూర్తం చూసుకుని మరీ దొంగను పట్టుకోవాలంటారా? ఇప్పటికిప్పుడే పట్టుకోవాలంటారా?” అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. అది బీజేపీ సొమ్మేమీ కాదని చెప్పారు. ఐటీ చర్యను ‘యాక్షనబుల్ ఇంటెలిజెన్స్‌’గా ఆమె పేర్కొన్నారు. ఐటీ దాడులు సరైన ప్రదేశంలో, సరైన సమయంలోనే జరిగాయని ఆమె స్పష్టం చేశారు.