యుపిలో గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే

పన్ను ఎగవేత ఆరోపణలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు తనిఖీలు చేస్తుండగా సంచుల కొద్ది నోట్ల కట్టలు గుట్లల్లా కనిపించడంతో షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.  
 
జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ బృందం గురువారం ఉదయం పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు ఏకకాలంలో.. కాన్పూర్, కన్నౌజ్, గుజరాత్, ముంబైలో ఉన్న సంస్థలలో జరిగాయి.
వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వరకు లెక్కించగా.. నగదు, పత్రాలతో కలిపి 150 కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు సంబంధించి ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
పీయూష్ జైన్   ఎస్‌పి అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు  కూడా. కొన్ని రోజుల క్రితమే సమాజ్ వాదీ పేరుతో పెర్ఫ్యూమ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. గురువారం మొదలైన ఈ దాడులు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
కన్నౌజ్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని అక్కడి నుంచి పెర్ఫ్యూమ్ దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతోందని తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రెండు సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని తెలిపారు.