కేంద్రంపై మమతా ఆరోపణలు ఖండించిన మిషనరీస్!

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓ ట్వీట్‌లో ఆరోపించారు. కేంద్రం చర్య వల్ల ఆ సంస్థలోని 22 వేల మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆమె విమర్శించారు. 
 
అయితే మమత ఈ ట్వీట్ చేసిన కాసేపటికి ఆ సంస్థ స్పందిస్తూ, అంతా సజావుగానే ఉందని వెల్లడించింది. ఆ సంస్థతో పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూడా ఆమె ఆరోపణలను ఖండించింది. పైగా, తమ బ్యాంకు అకౌంట్ ను స్తంభింప చేయమని ఆ సంస్థే స్వయంగా స్టేట్ బ్యాంకు ను కోరినట్లు ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 
 
మమత బెనర్జీ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్ట్‌మస్‌నాడు కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసినట్లు విని దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 
 
ఆ సంస్థల ఉద్యోగులు, చికిత్స పొందుతున్న 22 వేల మంది రోగులు ఆహారం, మందులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చట్టం అన్నిటి కన్నా గొప్పది అయినప్పటికీ, మానవతావాద కృషికి విఘాతం కలిగించరాదని తెలిపారు. 

ఈ నేపథ్యంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీత కుమార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దీని గురించి తమకు ఎవరూ ఏమీ చెప్పలేదని స్పష్టం చేశారు. దీని గురించి తనకు అసలు ఏమీ తెలియదని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తమకు ఏమీ చెప్పలేదని, బ్యాంకు లావాదేవీలు సజావుగానే జరుగుతున్నాయని ఆమె చెప్పారు. అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, ఎంవోసీకి చెందిన బ్యాంకు ఖాతాలేవీ తాము స్తంభింపజేయలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే తమ ఖాతాలను స్తంభింపజేయాలని కోరుతూ ఆ గ్రూపు నుంచే అభ్యర్థన అందినట్లుగా ఎస్‌బీఐ వెల్లడించిందని వివరించింది. 

అర్హతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ) రిజిస్ర్టేషన్‌ పునరుద్ధరణ కోసం ఎంవోసీ చేసుకున్న దరఖాస్తును ఈ నెల 25న తిరస్కరించినట్లు తెలిపింది.

మంత్రిత్వ శాఖ ప్రకారం, ఎఫ్ సి ఆర్ ఎ  2010,  ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రూల్స్ (ఎఫ్ సి ఆర్ ఆర్) 2011 ప్రకారం అర్హత షరతులను పాటించనందుకు ఎఫ్ సి ఆర్ ఎ   రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం ఆ సంస్థ చేసిన దరఖాస్తు డిసెంబర్ 25న తిరస్కరించారు. ఈ తిరస్కరణను సమీక్షించమని ఆ సంస్థ నుండి తిరిగి ఎటువంటి అభ్యర్ధన  గాని,దరఖాస్తు గాని రాలేదని కూడా వివరణ ఇచ్చారు.

ఆ సంస్థ ఎఫ్ సి ఆర్ ఎ నమోదు అక్టోబర్ 31 వరకు చెల్లుబాటులో ఉండగా, పునరుద్ధరణ దరఖాస్తు పెండింగ్ లో ఉన్న ఇతర సంస్థలతో పాటుగా చెల్లుబాటును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.