కేసీఆర్ ముందస్తుకు వెళతారని సిద్ధపడుతున్న బిజెపి!

తెలంగాణా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత మంగళవారం రాష్ట్రంలోని ముఖ్యమైన బిజెపి నాయకులతో జరిపిన భేటీ రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. 2023లో వలె ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదన్న సమాచారంతోనే ఈ సమావేశం అత్యవసరంగా జరిపినట్లు తెలుస్తున్నది. 

ఎన్నికలు ఎప్పుడు జరిపినా బిజెపి సిద్ధంగా ఉండాలన్నదే ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులకు అమిత్ షా ఇచ్చిన సందేశంగా కనిపిస్తున్నది. . తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారని చెబుతున్నారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోందని రాష్ట్ర బిజెపి నేతలు కూడా భావిస్తున్నారు. 

ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలే  చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్, కేంద్రంతో యుద్ధాని రెడీ ప్రజలలో `సెంటిమెంట్’ రగిల్చే విధంగా ప్రచారం జరుపుతున్నారని అంచనా వేస్తున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్‌ సరికొత్తగా ముందుకువెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. 

నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్‌కు ఈసారి అవకాశం ఉండకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమివ్వచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బిజెపి నేతలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు పొతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాతో రాష్ట్ర నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ఎత్తుగడలు అధికార పార్టీలో అసంతృప్తికి దారితీయవచ్చని, అటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.