తెలంగాణలో మరో కొత్త వ్యాధి

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు భయాందోళనకు గురి చేస్తున్న వేళ.. తాజాగా మరో కొత్త వ్యాధి కలవరానికి గురి చేస్తోంది. హైదరాబాద్‌లో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి అలజడి రేపుతోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగులు ఈ వ్యాధికి కారణమవుతాయి. క్రమంగా దీని బాధితుల సంఖ్య కూడా పెరుగడం వైద్యులను కలవరపెడుతోంది.
ఇటీవలి కాలంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో 15 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే. స్క్రబ్ టైఫస్‌తో ఈ  నెలలో నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి కాగా.. మరో ఇద్దరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
స్క్రబ్ టైఫస్  అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు దద్దుర్లు. స్క్రబ్ టైఫస్ సోకినవారికి యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అందించాల్సి ఉంటుంది. వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి డాక్సిసైక్లిన్ ఇవ్వొచ్చు. లక్షణాలు గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ తీసుకోవడం ద్వారా త్వరగా వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది.
ఇప్పటికైతే ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఓవైపు ఒమిక్రాన్‌తో హడలిపోతున్న నగర వాసులకు ఇప్పుడు స్క్రబ్ టైఫస్ వైరస్‌కు తోడవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత్‌తో పాటు ఇండోనేషియా, చైనా, జపాన్, నార్తర్న్ ఆస్ట్రేలియాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదైయ్యాయి.
ఒకే రోజు 14 ఒమిక్రాన్ కేసులు
కాగా,  రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. మరో నలుగురి ఫలితాలు తెలవలసి ఉంది. 

 ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో  క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని రాష్ట్ర హైకోర్టు కోర్టు పేర్కొన్న‌ది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న చేసింది.

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్, సంక్రాంతి వేడుక‌ల్లో జ‌నం గుమిగూడ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఢిల్లీ, మ‌హారాష్ట్ర త‌ర‌హా నిబంధ‌న‌లు ప‌రిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఒమిక్రాన్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 259 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. 
ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు రాష్ట్రానికి రాగా, వారిలో 63 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ లాక్ డౌన్ మొదలైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్ నుంచి గూడెం తన స్వంత  గ్రామానికి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. 

ఎల్లారెడ్డి పేట మండలం, నారాయణపురంలో ఓ శుభకార్యంలో బాధితుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలను వైద్యాధికారులు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.