మ‌రోసారి యునిటెక్ ప్ర‌మోట‌ర్ల అరెస్ట్‌

మ‌నీ లాండ‌రింగ్ కేసులో యునిటెక్ గ్రూప్ ప్ర‌మోట‌ర్లు సంజ‌య్‌చంద్ర‌, అజ‌య్ చంద్ర‌ల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని సోమ‌వారం సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీకి త‌ర‌లించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పాటియాలా హౌస్ మేజిస్ట్రేట్ కోర్టు జ‌డ్జి ఈ కేసును విచారించారు. 

ఒక‌రోజు ఈడీ క‌స్ట‌డీకి సంజ‌య్ చంద్ర‌,అజ‌య్ చంద్రల‌ను అప్ప‌గిస్తున్న‌ట్లు తెలిపారు.  మ‌నీ లాండ‌రింగ్ కేసులో సంజ‌య్‌-అజ‌య్ చంద్ర‌ల‌పై నూత‌న సాక్ష్యాధారాలు ల‌భించాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో వారిని క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించాల‌ని ఇంత‌కుముందే సుప్రీంకోర్టు ఆదేశించింది.

తీహార్ జైలులో ఉన్న‌ప్పుడు అండ‌ర్‌గ్రౌండ్ ఆఫీసు న‌డుపుతున్నారంటూ సంజ‌య్ చంద్ర‌, అజ‌య్ చంద్రల‌పై సుప్రీంకోర్టుకు గ‌త ఆగ‌స్టులో నివేదించింది. వెంట‌నే వీరిని ముంబై జైళ్ల‌కు త‌ర‌లించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. తీహార్ జైలులో చంద్ర‌ల బాగోతంపై ద‌ర్యాప్తు చేయాల‌ని ఢిల్లీ పోలీసు క‌మిష‌న‌ర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై 37 మంది తీహార్ జైలు అధికారుల‌పై కేసున‌మోదైంది. ఐపీసీలోని నేర‌పూరిత కుట్ర‌, అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోని వివిధ సెక్ష‌న్ల కింద వారిపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా, యునిటెక్ ప్ర‌మోట‌ర్ల‌పై ఢిల్లీపోలీస్‌, సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్న‌ది. 

గ‌త అక్టోబ‌ర్‌లో యునిటెక్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌మేశ్ చంద్ర‌, సంజ‌య్ చంద్ర భార్య ప్రీతిచంద్ర‌, కార్నౌస్టీ గ్రూప్‌కు చెందిన రాజేశ్ మాలిక్‌ల‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరు రూ.7638.43 కోట్ల మేర‌కు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

గ‌త నెల‌లో రూ.18.14 కోట్ల విలువైన ఆస్తులు జ‌ప్తు చేశామ‌ని ఈడీ తెలిపింది. గుర్‌గ్రామ్‌లో మ‌ల్టీప్లెక్స్‌, గురుగ్రామ్‌, ల‌క్నోల్లో ఆరు వాణిజ్య స‌ముదాయాలు బినామీ పేర్ల‌పై రిజిస్ట‌ర్ అయి ఉన్నాయి. అలాగే 24 బ్యాంకుల ఖాతాల‌ను, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఈడీ అధికారులు జ‌ప్తు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు యునిటెక్ ప్ర‌మోట‌ర్ల నుంచి రూ.690.66 కోట్ల విలువైన ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు.