వంట నూనెలపై సుంకాలు తగ్గించిన కేంద్రం 

దేశీయంగా సరఫరా పెంచి, వంటనెనూల ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా రిఫైర్డ్‌ పామాయిల్‌పై బేసిక్‌ కస్టమ్‌ సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ  నేటి నుంచి అమలులోకి రానుండగా.. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు అమలులో ఉంటుందని సీబీఐసీ పేర్కొంది. 

డిసెంబర్ 2022 వరకు లైసెన్స్ లేకుండా రీఫైన్డ్‌ పామాయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులకు అనుమతి ఉంటుందని సోమవారం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో ముడి పామాయిల్, పలు ఇతర వ్యవసాయ వస్తువుల కొత్త డెరివేటివ్ ఒప్పందాలపై నిషేధం విధించింది.

ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. అంతకు ముందు జూన్‌లో నూనె ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు రిఫైర్డ్‌ పామాయిల్‌ దిగుమతిపై నిషేధం విధించింది.

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. సోమవారం రిటైల్‌ మార్కెట్లో వేరు శెనగ నూనె కిలో రూ.181.48, ఆవనూనె రూ.187.43, వనస్పతి రూ.138.5, సోయాబీన్ ఆయిల్ రూ.150.78, పొద్దుతిరుగుడు నూనె రూ. 163.18, పామాయిల్ రూ.129.94గా ఉంది.

మరోవంక, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ను నిషేధిస్తూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకొన్నది. 

ట్రేడింగ్‌ నిషేధించిన వాటిలో గోధుమ, వడ్లు(బాస్మతీయేతర), శెనగలు, ఆవాలతో పాటు వాటి నుంచి ఉత్పత్తి చేసే వస్తువులు, సోయాబీన్‌, క్రూడ్‌ పామాయిల్‌, పెసలు ఉన్నాయి. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఏడాది పాటు నిషేధం కొనసాగుతుందని సెబీ పేర్కొన్నది.