పంజాబ్ ప్రభుత్వంను అప్రమత్తం చేసిన కేంద్రం

పంజాబ్‌లో ప్రార్థనా స్థలాలు, పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేస్తున్న ఘటనలు, మూకదాడుల ఘటనలు పెరుగుతుండటంపై కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, నిఘా పెంచాలని సూచనలిచ్చింది. 
 
ఇటీవల అమృత్‌సర్, కపుర్తలాలో ‘అపవిత్ర’ చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను మూకదాడుల్లో కొట్టి చంపారు.
కాగా, పంజాబ్‌లోని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు ప్రార్థనా స్థలాలను కొందరు టార్గెట్ చేసుకుంటున్నట్టుగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 రాష్ట్రంలో శాంతికి భంగం కలిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే వారికి గఠిష్ట శిక్ష విధించాలని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. మతపరమైన గ్రంథాలు, ఆలయాలను అపవిత్రం చేసే కేసుల్లో మరణశిక్ష విధించేలా నిబంధనలు మార్చాలని శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) డిమాండ్ చేసింది.
మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలనైనా ఉక్కుపిడికిలితో అణచివేయాలని ఎస్‌జీపీసీ  చీఫ్ హర్జిందర్ సింగ్ స్పష్టం చేశారు. ఈనెల 18న జరిగిన ఘటనపై దర్యాప్తు బాధ్యతను సిట్‌‌కు పంజాబ్ సర్కార్ అప్పగించింది.