జమ్మూ కాశ్మీర్ కు 7 అదనపు అసెంబ్లీ సీట్లు

జమ్ము ప్రాంతంలో అదనంగా ఆరు అసెంబ్లీ స్థానాలు, కాశ్మీర్‌కి ఒక అదనపు స్థానాన్ని కేటాయించినట్లు డీలిమిటేషన్‌ కమిషన్‌ పేర్కొంది. ఈ ప్రతిపాదనతో జమ్ములో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 43కి చేరగా, కాశ్మీర్‌ లోయలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 47కి చేరింది.

మొత్తం సీట్లలో తొమ్మిది సీట్లను ఎస్‌టిలకు, ఏడు సీట్లను ఎస్‌సిలకు ప్రతిపాదించినట్లు ఆ కమిషన్‌ తెలిపింది. ఢిల్లీలోని అశోక హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి బిజెపి ఎంపిలు జుగల్‌ కిషోర్‌, డా.జితేంద్ర సింగ్‌లతో పాటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఎంపిలు ఫరూఖ్‌ అబ్దుల్లా, జస్టిస్‌ (రిటైర్డ్‌) హస్నైన్‌ మసూది, మహ్మద్‌ అక్బర్‌ లోనిలు హాజరయ్యారు. 

ఈ ప్రతిపాదనపై డిసెంబర్‌ 31 లోగా సూచనలు ఇవ్వాల్సిందిగా కమిషన్‌ సభ్యులను కోరింది. డీలిమిటేషన్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ దేశారు నేతృత్వం వహిస్తుండగా, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా, జమ్ముకాశ్మీర్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌గా కూడా ఉన్నారు.

సరిహద్దులను పునర్‌నిర్మించడానికి, కొత్త నియోజకవర్గాలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. మార్చి 6 వరకు సమయం కేటాయించింది. 

2019లో జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడానికి ముందు, పూర్వ రాష్ట్రానికి అసెంబ్లీలో 87 సీట్లు ఉన్నాయి: కాశ్మీర్‌లో 46, జమ్మూలో 37,  లడఖ్‌లో నాలుగు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎన్నికలు జరగని 24 స్థానాలు కూడా ఆ రాష్ట్ర  అసెంబ్లీలో ఖాళీగా ఉన్నాయి. 

ఏడు స్థానాలు చేరడంతో ఎన్నికలు జరిగే స్థానాల సంఖ్య 90కి చేరుకోగా, గతంలో ఉన్న పద్ధతిలో ఇద్దరు మహిళలను నామినేషన్ చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 1963, 1973,  1995లలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరిగింది.

“కమీషన్ నిష్పక్షపాతంగా తయారు చేసిన పత్రంతో బయటకు వచ్చింది. పార్టీలకు అతీతంగా అనుబంధిత సభ్యులందరూ డీలిమిటేషన్ కమిషన్ చేసిన పనిని అభినందించారు. కమిషన్ అనుసరించిన పారామితులపై ఎన్‌సి సభ్యులు కూడా సంతృప్తి చెందారు, ” అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు.

అయితే, కమిషన్ ముసాయిదా సిఫార్సు ఆమోదయోగ్యం కాదని ఎన్‌సి ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. “జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా సిఫార్సు ఆమోదయోగ్యం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకి 6, కాశ్మీర్‌కు 1 మాత్రమే ఉండేలా కొత్తగా సృష్టించిన అసెంబ్లీ నియోజకవర్గాల పంపిణీని సమర్థించడం లేదు” అని ఆయన ట్వీట్ చేశారు.