దలైలామాతో మోహన్ భగవత్ భేటీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్  మోహన్ భగవత్ సోమవారం టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలై లామాను సోమవారం ధర్మశాలలో కలుసుకున్నారు. మెక్‌లీడ్‌గంజ్‌లోని దలై లామా నివాసంలో దాదాపు గంట పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు.
 
2020లో కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి ప్రజలను కలుసుకోవడం నిలిపివేసిన దలైలామా ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి ప్రజలతో సమావేశమవుతున్నారు. వారిద్దరి సమావేశంలో చర్చించిన అంశాల గురించి ఎవ్వరు వెల్లడించనప్పటికీ, దలైలామా చైనా ఆధిపత్య ధోరణులను ఖండిస్తూ ప్రతివారి స్వాతంత్య్రంను గౌరవించాలని స్పష్టం చేశారు. 
 
భారత్ కు టిబెట్ సోదర దేశమని, భారతీయులు ఎల్లప్పుడూ టిబెట్ ప్రజలకు సంఘీభావంగా ఉంటారని డా. భగవత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మత సమరస్యంకు భారత్ ఒక ఆదర్శమని, ఆ విధానం మొత్తం ప్రపంచం తెలుసుకొనేటట్లు భారత్ తెలియచెప్పాలని దలైలామా పేర్కొన్నారు. 
 
టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధ్యక్షుడు పెన్పా సెరింగ్, ఆయన క్యాబినెట్ సభ్యులు, టిబెట్ ప్రవాస పార్లమెంట్ స్పీకర్ సోనమ్ తెంఫెల్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ అధినేతను కలుసుకున్నారు.  వారిద్దరూ మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల గురించి చర్చించి ఉండవచ్చని సెరింగ్ విలేకరులకు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్ర, ధర్మశాలకు ఐదురోజుల పర్యటన నిమిత్తం భగవత్ వచ్చారు.