భారత్ లక్ష్యంగా, పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థలు!

భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న జైషె మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌తోపాటు 2008 ముంబై దాడుల ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సాజిద్‌ మిర్‌ కూడా ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అగ్రరాజ్యం అమెరికా తన తాజా నివేదికలో వెల్లడించింది. 

 ఉగ్రవాదంపై అమెరికా రూపొందించిన ఈ నివేదిక (2020)ను ఆ దేశ   విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌   విడుదల చేశారు.  అఫ్ఘానిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకున్న అఫ్ఘాన్‌ తాలిబన్‌ దాని అనుబంధ సంస్థ హఖాని నెట్‌వర్క్‌ (హెచ్‌క్యూఎన్‌), భారత్‌ను టార్గెట్‌ చేసుకున్న లష్కరె తాయిబా దాని అనుబంధ సంస్థలు, జైషె మొహమ్మద్‌ వంటి సంస్థలు పాక్‌ భూభాగం నుంచి పనిచేస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

మసూద్‌ అజర్‌, సాజిద్‌ మిర్‌ వంటి పేరుమోసిన ఉగ్ర నేతలు తమ దేశంలో ఉన్నారని తెలిసినప్పటికీ పాక్‌ వారిపై చర్యలు తీసుకోవడం లేదని, దీంతో వారు అక్కడ స్వేచ్ఛ గా తిరుగుతున్నారని తెలిపింది. పాక్‌లోని కొన్ని మదర్సాలు హింసాత్మక తీవ్రవాద సిద్ధాంతాలను బోధిస్తూనే ఉన్నాయని తెలిపింది.

తీవ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా భారత్‌, అమెరికా ప్రభుత్వాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ, ప్రాంతీయ ఉగ్రవాద శక్తులను గుర్తించి, వాటి వ్యూహాలను భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను కూడా అగ్రరాజ్యం ప్రశంసించింది.

గతేడాది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎ్‌స)కు సంబంధించిన 34 కేసులను ఎన్‌ఐఏ విచారించిందని, కేరళ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 10 మంది అల్‌కాయిదా కార్యకర్తలతోపాట సుమారు 160 మందిని అరెస్టు చేసిందని తెలిపింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐఎస్‌ వద్ద గతేడాది నవంబరు నాటికి భారత సంతతికి చెందిన 66 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నట్టు గుర్తించామని ఈ నివేదికలో అమెరికా వెల్లడించింది.