పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్

 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియన్ చాంపియన్స్ ట్రోపీ హాకీ 2021లో భారత్ దుమ్మురేపింది. గత రికార్డులను సవరించింది.  హోరాహోరీగా జరిగిన రౌండ్ రాబిన్ పోరులో పాక్‌ను 3-1తో మట్టికరిపించి సెమీస్‌‌కు దూసుకెళ్లింది. 
 
2018లో మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లు టోర్నీని పంచుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నేడు డిఫెండింగ్ చాంపియన్లుగా ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
 
చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్‌‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 9సార్లు తలపడగా ఏడుసార్లు పాక్, రెండుసార్లు భారత్ విజయం సాధించాయి. నేటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన భారత్ ఈ అంకెల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించింది. 
 
ఈ టోర్నీలో ఇంతకుముందు కొరియాతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో చిత్తు చేసింది. ఇప్పుడు పాక్‌ను చిత్తుచేసి దర్జాగా సెమీస్‌లోకి ప్రవేశించింది.
 
స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచాడు. అక్షదీప్ సింగ్ ఒక ఫీల్డ్ గోల్ చేశాడు. పాకిస్తాన్ తరపున జునైద్ మంజూర్ ఒకే ఒక గోల్ నమోదు చేశాడు.