తిరుపతి వేదికగా దశదిశలా అమరావతీ నినాదం 

ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని ఆంధ్ర ప్రదేశ్ మాత్రానే అని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజానీకం వ్యతిరేకిస్తున్నదని తిరుపతి వేదికగా శుక్రవారం జరిగిన బహిరంగసభ స్పష్టం చేసింది. రాజధానికి భూములిచ్చిన రైతులు తాము చేసిన త్యాగాలను, ఇపుడు ఎదుర్కొంటున్న వేధింపులను గద్గద స్వరంతో వివరించిన తీరు ప్రజలను కదిలించింది.

వైసిపి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు అమరావతి మాత్రమే రాజధాని అని స్పష్టం చేయడం, సిపిఎం మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఈ వేదికపై ఉమ్మడిగా తమ విధానాన్ని స్పష్టం చేయడంతో ఇప్పటివరకు అమరావతి ప్రాంతంకు పరిమితమైన రాజధాని పరిరక్షణ ఉద్యమం ఇప్పుడు విశాల ప్రాతిపదికను సంపాదించుకున్నట్లు అయింది. 

తమ ఉద్యమానికి మద్దతుగా అమరావతి రైతులు 44 రోజుల పాటు సాగించిన పాదయాత్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసినా విజయవంతంగా ముగియడం, దారి పొడుగుతున్న వివిధ వర్గాల ప్రజల నుండి అపూర్వమైన సంఘీభావం లభించడంతో ఉద్యమించిన రైతులలో నూతన ఉత్తేజం కనిపిస్తున్నది.

 ‘మీ భూములను త్యాగం చేస్తే.. రాష్ట్రంతోపాటు మీ బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని గత ప్రభుత్వం చెప్పింది. దాంతో 29,800 కుటుంబాల రైతులం.. కన్నతల్లిలాంటి 34,300 ఎకరాల బంగారు భూములను ఇచ్చేశాం. ఈ భూముల్లో.. గత ప్రభుత్వ హయాంలో  రూ.9,500 కోట్లతో పలు భవనాలు నిర్మించా’రంటూ ఆ ప్రాంత రైతులు గుర్తు చేసారు. 

 అలా నిర్మించిన భవనాల్లోనే ఇప్పటి ప్రభుత్వం కూడా పాలన సాగిస్తూ.. అమరావతిలో ఏ ఒక్క కట్టడం లేదని, అంతా గ్రాఫిక్స్‌ అని అనడం హాస్యాస్పదం అని ధ్వజమెత్తారు.  భవనాలు గ్రాఫిక్స్‌ అయితే.. వాటిల్లో ఉంటూ పరిపాలన సాగించే ప్రభుత్వాన్ని కూడా గ్రాఫిక్స్‌ పాలన అనాలేమో? అంటూ ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర భవిష్యత్తు కోసం మా భూములు త్యాగం చేస్తే.. ఇప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని  ముక్కలు చేసేందుకు మూడు రాజధానుల ప్రస్తావనను లేవనెత్తి సరిగ్గా ఇప్పటికి 731 రోజులవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తున్న తమపై అడుగడుగునా రాళ్ల వర్షం తప్పదని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని గుర్తు చేశారు. 

అయితే  ఇప్పటి వరకు ఏ ఒక్కరి నుంచి కూడా వ్యతిరేక భావన కనిపించలేదని, రైతు ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ముందుకు తీసుకొచ్చి.. రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 దేశానికి వెన్నెముక వంటి రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. 80 కేసులు పెట్టి, 18 రోజులు జైళ్లలో కూర్చోబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వ విధానాల వల్ల ఇంట్లో కుటుంబ బాధ్యతలు తప్ప లోకం తెలియని మహిళలు రోడ్డుపైకి వచ్చి పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చిందని  నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు లతో సహా అనేకమంది ప్రముఖులు బహిరంగసభలో ప్రసంగించారు.