విద్య, వైద్యంలకు భారీ కేటాయింపులు, నిధులు అంతంత మాత్రం 

తమది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొనే వారెవరైనా విద్య, వైద్య రంగాలకు పూర్తి భరోసాగా నిలబడాలి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి అవసరమైన కేటాయింపులు పెరగడంలేదు. బడ్జెట్‌ గణాంకాలలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తున్నప్పటికీ, నిధుల విడుదల మాత్రం ఆశించినస్థాయిలో ఉండటంలేదు. 

బడ్జెట్‌లో కనీసం ఎనిమిది శాతాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఎపి 6.6 శాతం కేటాయించి దేశంలో ఎనిమిదో స్థానంగా ఉండటం గమనార్హం. రాష్ట్రాల బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ కేటాయింపులపై పిఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 

8 శాతం కేటాయింపును 2020కల్లా సాధించాలని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ సూచించగా, చాలా రాష్ట్రాలు ఆ లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. దీంతో 15వ ఆర్థిక సంఘం 2022కల్లా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశిం చింది.  2021-22వ ఆర్థిక సంవత్సరంలో ఎపి వార్షిక బడ్జెట్‌ రూ.2,29,779.27 కోట్లుండగా, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.13,830.34 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇది మొతం బడ్జెట్‌లో 6.60 శాతంగా ఉన్నట్ల పిఆర్‌ఎస్‌ నివేదిక తెలిపింది. 

2020-21లో వార్షిక బడ్జెట్‌ రూ.2,24,789.18 కోట్లకు రూ.11,419.48 కోట్లు (5.08 శాతం), 2019-20లో రూ.2,27,975.00 కోట్లకు రూ.11,399.23 కోట్లు (5.01 శాతం) కేటాయింపులు ఉన్నట్లు తెలిపింది. మూడేళ్లలో ఎపిలో 1.5 శాతం కేటాయింపులు పెరిగినప్పటికీ, మొత్తంగా 8 శాతం ఉండాలని నివేదిక స్పష్టం చేసింది. 

బడ్జెట్‌ కేటాయింపులలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం), ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలతోపాటు ఆసుపత్రుల నిర్మాణం, సౌకర్యాల కల్పన, నిర్వహణ తదితర వాటికి కలిపి కేటాయింపులు ఉన్నట్లు పేర్కొంది. ఈ కేటాయింపుల వల్ల వైద్య, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏమాత్రం సరిపోవని నివేదిక స్పష్టం చేసింది. 

ఆర్థిక సంఘం ఆశించిన మేరకు కేటాయింపులు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంలేదని తెలిపింది. ఫలితంగా కొద్దిపాటి జ్వరం వచ్చినా పేదలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని నివేదిక వెల్లడించింది. పేదల కుటుంబ పోషణే అంతంతగా ఉంటే, వైద్యానికి అధిక ఖర్చులు చేయడం వారికి భారంగా ఉంటుందని పేర్కొంది.