భారత వాతావరణ విభాగం ఆంధ్రప్రదేశ్‌లో 32 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, 61 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 974 కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు తీరప్రాంతంలోనే ఉన్నాయి.
ఉష్ణమండల తుపాన్లతో కోస్తా ప్రాంతం ప్రకతి విపత్తులను ఎదుర్కొంటూనే ఉంది. పెను తుపాన్లు, ప్రచండమైన గాలులతో ఏర్పడే జలవిలయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలలో తరచుగా పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోందని మంత్రి అన్నారు. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరం తుపాను సంబంధించిన విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు తుపాన్ల ముప్పు తప్పడం లేదని వివరించారు.
50 ఏళ్ళ పైబడిన 33 భారీ డ్యామ్ లు
ఆంధ్రప్రదేశ్‌లో 1971కి ముందు నిర్మించిన (50 ఏళ్లకు పైబడి) భారీ డ్యామ్‌లు 33 ఉన్నాయని, 1921కి ముందు నిర్మించిన (100 ఏళ్లకు పైబడి ) భారీ డ్యామ్‌లు 5 ఉన్నాయని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.
లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 1971కి ముందు నిర్మించిన (50 ఏళ్లకు పైబడి) భారీ డ్యామ్‌లు 58 ఉన్నాయని, 1921కి ముందు నిర్మించిన (100 ఏళ్లకు పైబడి ) భారీ డ్యామ్‌లు 18 ఉన్నాయని తెలిపారు.
అలాగే దేశవ్యాప్తంగా 1971కి ముందు నిర్మాణం అయిన 1,175 డ్యామ్‌లు, 1921కి ముందు నిర్మాణం అయిన 227 డ్యామ్‌లు ఉన్నాయని తెలిపారు.

More Stories
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు