చరిత్ర వాస్తవాలపై మరింత పరిశోధన జరగాలి

భారతదేశ చరిత్రలోని వాస్తవాల గురించి మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నదని, పరాయి పాలకుల ఏలుబడిలో వక్రీకరణలతో రాసిన మన చరిత్రను వాస్తవ అంశాలతో తిరిగి వెలుగులోకి తీసుకురావడం తక్షాణావసరమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

స్వరాజ్య సమరయోధుల జీవితాలను అధ్యయనం చేసి, వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘గాంధీ టోపీ గవర్నర్’ పుస్తకాన్ని న్యూఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఈడ్పుగంటి రాఘవేంద్ర రావు సంక్షిప్త జీవితగాధ నేపథ్యంలో ‘గాంధీ టోపీ గవర్నర్’ పుస్తకాన్ని యార్లగడ్డ రచించారు. బ్రిటీష్ పాలనలో గవర్నర్‌గా కొనసాగుతూనే టోపీతోపాటు ఖద్దరు వాడకానికి ఈడ్పుగంటి పెద్దపీట వేశారని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.

ఒకప్పుడు చట్టసభల్లో పదునైన విమర్శలు ఉండేవన్న ఉపరాష్ట్రపతి.. చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఆదర్శంగా నడుచుకోవాలని సూచించారు. భారతదేశం అమృతోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో స్వరాజ్య సమరయోధుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు అన్ని భాషల్లో యువతకు అందుబాటులోకి తీసుకురావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల సమరయోధుల జీవితాలను వారి మాతృభాషల్లో ముందు తరాలకు తెలిసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, పుస్తక రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తమిళనాడు పూర్వ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, ఎమెస్కో బుక్స్ సీఈఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.