మూడు ప్రాంతాలలో వైసిపి నేతల అలజడుల చిచ్చు

అప్పు పుడితే గాని పూట గడవని దుస్థితికి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దిగజార్చి, అభివృద్ధికి సమాధి చేస్తున్న వైసిపి ప్రభుత్వంలోని పెద్దలు మూడు  ప్రాంతాలలో అలజడులు చిచ్చు రేపి ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుండి మళ్లించే కుతంత్రాలు చేస్తున్నారని నెల్లూరు లో బిజెపి నాయకులు కరణం భాస్కర్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

మూడు రోజుల క్రితం స్వయంగా  అధికార పార్టీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్, మిధున్ రెడ్డిలు  రాష్ట్రం అప్పుల్లో ఉందని, జీతాలకు  కూడా డబ్బులు లేవని , ఇవ్వలేని  పరిస్థితని కేంద్రం ఆదుకో కపోతే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు.

.రాష్ట్రంలో ప్రజల మధ్యన పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడిన మాటల మీద, అభివృద్ధి జరగడం లేదని, పోలవరం ఆగిపోయిందని రకరకాలుగా జరుగుతున్న చర్చను  పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని భాస్కర్ ఆరోపించారు.
 
అమరావతి రైతులు రాష్ట్రంలో రాజధాని ఒకటే  ఉండాలని 46 రోజులుగా పాదయాత్ర చేసి శ్రీ  వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఈనెల 17వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభకు కోర్టు అనుమతి తీసుకుని పెట్టుకుంటున్నారని గుర్తు చేశారు. 
ఆ సభను  భంగం చేయుటకు ప్రయత్నాలు చేసి,  కుదరక పోయేసరికి రాయలసీమ మేధావుల పేరుతో తాము కూడా సభ పెడతామని ఈ నెల 18వ తేదీ న వారు కూడా అదే తిరుపతి లో సభ నిర్వహిస్తున్నారని తెలిపారు.

నిజంగా  ఈ మేధావులు రాయలసీమ అభివృద్ధి కోసం అడిగే వారైతే, రాయలసీమ ప్రాంత ప్రజలు అడుగుతున్నది కర్నూలులో హైకోర్టు పెట్టమని సభను కర్నూల్ లో జరపకుండా తిరుపతిలో ఎందుకు జరుపుతున్నట్టు? అంటూ ప్రశ్నించారు. అంటే పోటీ సభ అనేగదా? అని నిలదీశారు. 

 
ప్రభుత్వ పెద్దలు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో, రాయలసీమ మేధావుల సంఘం పేరుతో,మూడు రాజధానులు కావాలి, శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలి అని ఈరోజు తిరుపతిలో అన్ని కాలేజీలను, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను మూసి వేయించి వేలాది మందితో ఊరేగింపులు చేశారని ధ్వజమెత్తారు.  .

మరోవంక, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు  నాయకత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విశాఖపట్నంలో లో పాలనా రాజధాని కావాలని తీర్మానం చేసి  ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నారు.
గతంలో  రాయలసీమ రాష్ట్రం కావాలని రాయలసీమ రాజకీయ నాయకులు మైసూరా రెడ్డి, బైరెడ్డి  రాజశేఖర్ రెడ్డి తదితర నాయకులు ఉద్యమం మొదలుపెట్టిన సంగతి మనం మర్చిపోలేదని చెప్పారు.

ఈ చర్చలు ఇలాగే కొనసాగితే తూ  ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కుడా తమకు ఒక రాష్ట్ర ఇవ్వండి, తాము  ఎవరితో కలవము అని అడిగే పరిస్థితి కూడా రావచ్చని భాస్కర్ హెచ్చరించారు. ఇదంతా చూస్తుంటే ఈ చిన్న రాష్ట్రాన్ని మూడు, నాలుగు ముక్కలు అయ్యేదానికి  పావులుకదుపుతున్నట్టుగా, బీజాలు పడుతున్నట్టుగా అనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అభివృద్ధి అనేది రాజధానులు ఏర్పాటు చేస్తేనే రాదని స్పష్టం చేశారు.  ఆ ప్రాంత ప్రకృతిని, వనరులను, పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటికనుగుణంగా ప్రాజెక్టులు నిర్మాణం చేసి, ఆర్థిక వెసులుబాటు , ప్రోత్సాహం కల్పిస్తే  అభివృద్ధి జరుగుతుందని హితవు చెప్పారు. .ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన ఏ ప్రాంతంలో కానీ, ఎ జిల్లాలో కానీ చేసిన దాఖలాలు ఈ రెండున్నర  సంవత్సరాలలో లేనే  లేవని ధ్వజమెత్తారు.

మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా  అభివృద్ధి జరిగిన ప్రాంతం.మరి ప్రక్కన 50 కిలోమీటర్ల దూరంలో వున్న  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని గుర్తు చేశారు. అక్కడున్న సామాన్య ప్రజలు కూలి పనుల కోసం రాష్ట్రమంతా పోయి ఉన్నారే? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అభివృద్ధి ఎటూ లేదు కాబట్టి జరుగుతున్న వైఫలయలను ప్రజల చర్చించు కోకుండా దృష్టి మళ్లించే రాజకీయాలు చేయడంలో ఇది ఒక భాగం అని బిజెపి నేత విమర్శించారు.