యునెస్కో వారసత్వ జాబితాలో బెంగాల్ దుర్గాపూజ

దేశంలోనే అత్యంత ప్ర‌శ‌స్తి పొందిన పశ్చిమ బెంగాల్ లోని దుర్గా పూజకు ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అరుదైన గుర్తింపు ఇచ్చింది. మానవాళి సాంస్కృతిక వారసత్వ నైరూప చిహ్నాల  జాబితాలో దీనిని చేర్చింది.  న‌వ రాత్రుల్లో అక్క‌డ జ‌రిగే దుర్గా పూజ‌లు విశేష ప్రాచుర్యం పొందాయి. డిసెంబర్ 13 నుండి 18 వరకు పారిస్‌లో జరుగుతున్న అంతర్ ప్రభుత్వ  కమిటీ 16వ సమావేశంలో రెండవ రోజు బుధవారం జాబితాలో ‘కోల్‌కతాలో దుర్గా పూజ’ అని చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

“మతం, లింగం,  ఆర్థిక వర్గాల అడ్డంకులను అన్నింటినీ కలుపుకొని ఉన్న విధానం కోసం పండుగ ప్రత్యేకంగా ప్రశంసించబడింది” అని  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. గత సెప్టెంబరులో, పశ్చిమ బెంగాల్ పర్యాటక శాఖ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు దుర్గ పూజ గురించి యునెస్కో కు ప్రతిపాదనను పంపింది.
 
యునెస్కో వెబ్‌సైట్‌లో “దుర్గా పూజ మతం,  కళ’ బహిరంగ ప్రదర్శనకు ఉత్తమ ఉదాహరణగా, సహకార కళాకారులు, డిజైనర్లకు అభివృద్ధి చెందుతున్న సంప్రదాయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది. మతాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారిని, లింగభేదం లేకుండా, పేద, ధనిక అనే తేడా పాటించకుండా అందర్నీ కలుపుకుంటూ జరుపుకునే పండుగ ఇదంటూ యునెస్కో కీర్తించింది. 
 
ఈ పండుగ సందర్భంగా పట్టణ ప్రాంతాలలో భారీ స్థాయిలో ఏర్పాట్లు, మంటపాలు, అలాగే సాంప్రదాయ బెంగాలీ డ్రమ్మింగ్, దేవతకు పూజల ద్వారా సంబరాలు జరుపుకొంటారు. 
ఈ అరుదైన గౌరవం  ద‌క్క‌డంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట్ట‌ర్ వేదిక‌గా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం ప్ర‌తి భారతీయుడికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, యునెస్కో జాబితాలో చోటు ద‌క్క‌డం ఎంతో సంతోష‌క‌ర‌మైన విష‌యం అని మోదీ పేర్కొన్నారు. 
 
ఇక బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ విష‌యం బెంగాలీల‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని తెలిపారు. తాము దుర్గా పూజ‌ను కేవ‌లం పూజ‌గా మాత్ర‌మే నిర్వ‌హించ‌మ‌ని, అది ఓ భావ‌న‌లాగా నిర్వ‌హించుకుంటామ‌ని మ‌మ‌త  చెప్పారు. 

ఇంతకు ముందు,  2017లో కుంభమేళా, 2016లో యోగాతో భారతీయ పండుగలకు ఇటువంటి  గుర్తింపు లభించింది. పంజాబ్‌లోని సాంప్రదాయ ఇత్తడి, రాగి హస్త కళలకు 2014లో గుర్తింపు లభించగా, మణిపూర్ సంకీర్తన ఆచార గానం   2013లో గుర్తింపు పొందింది.

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాకు చెందిన చౌ జానపద నృత్యానికి 2010లో ఇటువంటి గుర్తింపు లభించింది, ముడియెట్టు, ఆచార థియేటర్, కేరళ నృత్య నాటకం, రాజస్థాన్‌లోని కల్బెలియా జానపద పాటలు, నృత్యాలతో పాటు, కుటియాట్టం సంస్కృత థియేటర్, రాంలీలా, వేద మంత్రాల సంప్రదాయం, లడఖ్ బౌద్ధ శ్లోకాలు గతంలో ఈ విధమైన గుర్తింపును పొందాయి.