
ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. యూకేలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ధృవీకరించారు.
పశ్చిమ లండన్‌లోని పడింగ్టన్ సమీపంలో ఓ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను సందర్శించిన బోరిస్ జాన్సన్.. ఒమిక్రాన్‌వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఈ వేరియంట్ బారినపడి ఒక వ్యక్తి మరణించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
‘ఈ ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను భావిస్తున్నా. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. జనాల్లో ఇది ఎంత వేగంగా విస్తరిస్తున్నదో గుర్తించాల్సిన అసవరం ఉన్నది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్‌లు అందించడమే ఉత్తమం అనేది నా అభిప్రాయం’ అని బోరిస్ జాన్సన్ చెప్పారు.
వేగంగా విస్తరిస్తున్న వేరియంట్‌తో మరో మరో వేవ్ తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా దీనికి చాలా హై రిస్క్ ఉందని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఇది వ్యాక్సిన్ రక్షణ నుంచి తప్పించుకుంటుందనడానికి కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయని, కాబట్టి దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.
అయితే ఈ వేరియంట్ తీవ్రతను అంచనా వేయడానికి సరిపోయే డేటా లేదని పేర్కొంది. ప్రాధమిక పరిశోధన ప్రకారం, ఇన్‌ఫెక్షన్ పెరగకుండా ఉంచే ఇమ్యూనిటీ వ్యవస్థ నుంచి ఈ వేరియంట్ తప్పించుకుంటోందని, అదే సమయంలో చాలా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కనబడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భవిష్యత్తులో ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
కొత్త వేరియంట్‌పై యూకేలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టగా అదనపు భద్రతా చర్యలు తీసుకోకుంటే వచ్చే ఏప్రిల్ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలకు ఒమిక్రాన్ వేరియంట్ కారణమవుతుందని హెచ్చరించారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్, దక్షిణాఫ్రికాలోని స్టెల్లెన్‌బోష్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా పరిశోధనను నిర్వహించారు.
ఇతర దేశాల కంటే యూకేలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతి రోజు 600 మందికిపైగా ఒమిక్రాన్ బారినపడుతున్నారు. అయితే, ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసు అందిస్తున్నా.. ఆసుపత్రిలో చేరే అవకాశాలు 60 శాతానికి పెరిగాయి.
కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాకూ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ చేరింది. ఉత్తర చైనాలోని టియాంజిన్ నగరంలో కొత్త వేరియంట్ కేసు నమోదైంది. దీన్ని ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఉత్పరివర్తనం బారినపడ్డ వ్యక్తి డిసెంబర్ 9న విదేశాల నుంచి నగరానికి వచ్చాడని టియాంజిన్ డైలీ తెలిపింది. సదరు వ్యక్తి ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచగా.. చికిత్స పొందుతున్నాడని పేర్కొంది.
కరాచీకి చెందిన 57 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు పాకిస్థాన్ లోని అగ్రస్థాయి యాంటీ కరోనా వైరస్ పాలక వర్గం నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్‌సిఒసి) సోమవారం నిర్ధారించింది. పాకిస్థాన్‌లో ఇదే మొదటి ఒమిక్రాన్ కేసు.
ఇంతవరకు కరోనా టీకా తీసుకోని బాధితురాలు ఆగాఖాన్ యూనివర్శిటీ ఆస్పత్రిలో గతవారం చేరగా, జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇస్లామాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. బాధితురాలు ప్రస్తుతం ఇంటివద్దనే క్షేమంగా ఉందని, అన్ని పనులు చేసుకుంటోందని ఆస్పత్రి ప్రకటించింది.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ