రంజన్ గోగోయ్‌ పై రాజ్యసభ ధిక్కార నోటీసు

రాజ్యసభ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ప్రధాన న్యాయమూర్హ్టి జస్టిస్ రంజాన్ గొగోయ్ పై  పార్లమెంట్‌ ధిక్కార నోటీసును తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు సభ హక్కులను ఉల్లంఘించినట్లుగా ఉన్నాయని, సభ ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా ఉన్నాయని, అలాగే సభ ప్రత్యేక అధికారాలను ధిక్కరించే విధంగా ఉన్నాయంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆ నోటీసులో పేర్కొంది.

తన ఇష్టం వచ్చినపుడు సభకు హాజరవుతానని, పార్టీల సభ్యుల్లా బెల్‌ కొట్టగానే హాజరుకావాలనే నిబంధన తనకు లేదని ఇటీవల జస్టిస్‌ రంజన్‌ గొగోయ్  వ్యాఖ్యానించారు. గతేడాది మార్చిలో సభకు నామినేట్‌ అయినప్పటి నుండి కేవలం పదిశాతం కన్నా తక్కువగా రాజ్యసభకు ఆయన హాజరయ్యారు. దీంతో సభకు సరిగా హాజరుకాకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు జస్టిస్‌ ఈ విధంగా సమాధానమిచ్చారు.

”ఇటీవల జరిగిన రెండు సెషన్‌లకు కరోనా కారణంగా హాజరుకావడంలేదని రాజ్యసభకు సమాచారమిచ్చానని అన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో కేవలం ఆర్‌టి-పిసిఆర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారని, భౌతిక దూరం ఆంక్షలను పాటించడం లేదని, సీట్ల అమరిక కూడా సౌకర్యవంతంగా లేదని..దీంతో సభకు హాజరుకావడం నాకు ఇబ్బందికరంగా ఉంది” అని  పేర్కొన్నారు. 

పైగా, “నాకు నచ్చినపుడు, ముఖ్యమైన విషయాలపై చర్చించాలనుకున్నప్పుడు రాజ్యసభకు వెళతా” అని చెప్పారు. తాను  నామినేట్‌ సభ్యుడినని, స్వతంత్ర అభ్యర్థినని, ఏ పార్టీ తనకు విప్‌ జారీ చేయలేదని పేర్కొన్నారు. బెల్‌ కొట్టగానే పార్టీల ప్రతినిధులు హాజరైనట్లు .. తనకు ఆంక్షలు, పరిమితులు లేవని తెలిపారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ తాను రాజ్యసభ సభ్యుడిగా ఎలాంటి జీతాలు తీసుకోవడం లేదని, దీని కంటే ఏ ట్రిబ్యూనల్‌కో చైర్మెన్ అయ్యుంటే మంచి జీతాలు, సౌలభ్యాలు ఉండేవని చెప్పారు.