బ్యాంకింగ్‌ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచే సంస్కరణలు

డిపాజిట్‌ బీమా విషయంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఖాతాదారుల విశ్వాసాన్ని పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ‘డిపాజిటర్స్‌ ఫస్ట్‌’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌  (డీఐసీజీసీ) సవరణ బిల్లుకు ఆగస్టులో పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం గుర్తు చేశారు. 

డీఐసీజీసీ చట్టాన్ని సవరించిన తర్వాత దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడానికి వేచి ఉండాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. బ్యాంకు నష్టాల్లో ఉండి, ఖాతాను స్తంభింపచేసినప్పుడు.. రూ.5లక్షల వరకూ నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుందని చెప్పారు.

ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కేంద్ర రాష్ట్రాల సహకార బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్‌డ్, కరంట్, రికరింగ్ డిపాజిట్లకు ఈ ఇన్సురెన్స్ పథకం వర్తించనుందని ప్రధాని తెలిపారు. 

బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని పెంచాలని తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరేవాడినని, కానీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు.  ఆ పని చేయడం కోసమే తనను ప్రజలు ప్రధాన మంత్రిని చేశారని నరేంద్ర మోదీ చెప్పారు. 

బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచామని, దీని వల్ల ఒకవేళ బ్యాంకులు దివాలా తీసినా లేదా నష్టాల్లో నడుస్తున్నా డిపాజిటర్ల సొమ్ములో రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ భద్రత ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. 

ఆర్‌బీఐ మారటోరియం విధించిన మరికొన్ని బ్యాంకుల ఖాతాదారులకు కూడా త్వరలో బీమా సొమ్ము అందనుందని ప్రధాని తెలిపారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతూ ఈ నేపథ్యంలో బ్యాంకులను రక్షించుకోవాలంటే.. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

భారత్ లో ఏళ్ల తరబడి సమస్యలు చాపకింద నీరుగార్చే ధోరణి  నెలకొని ఉంది. కానీ నేటి న్యూ ఇండియా సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడంపై దృష్టి పెడుతుందని, వాటి పరిష్కారం ఆలస్యం కాదని ప్రధాని భరోసా ఇచ్చారు.