యూనివర్సిటీల్లో ప్రభుత్వ జోక్యంపై కేరళ గవర్నర్ ఆగ్రహం

వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సుల్లర్ల నియామకం విషయమై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పునరాయి విజయన్ ప్రభుత్వం మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ కేరళ గవర్నర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9న యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారని, వెంటనే ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నారు.  కానీ నిరసనగా ఆయన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి వి.పి. ఆనందం,  మంత్రి కె.ఎన్. బాలగోపాల్ గవర్నర్‌ను స్వయంగా కలిసి బుజ్జగించే ప్రయత్నం చేసిన ఫలించలేదు. భేటీ ముగిసిన వెంటనే ఢిల్లీ వెళ్లిన గవర్నర్ డిసెంబర్ 17న రాష్ట్రానికి రానున్నారు.

ఇంతలో, కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) విశ్వవిద్యాలయాలలో జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని నిందించింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కమ్యూనిజాన్ని బలవంతంగా ప్రయోగించిందని, ఇక్కడ రాజకీయ జోక్యంతో గవర్నర్ కూడా విసిగిపోయారని కాంగ్రెస్ ఎంపీ కె. మురళీధరన్ ధ్వజమెత్తారు. 
 

ఐయుఎంఎల్ నాయకుడు ఎం కె మునీర్ కూడా గవర్నర్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘కేరళ గవర్నర్‌తో సంబంధం లేకుండా నియామకాలు చేబడుతూ ఆయనను ప్రభుత్వం రబ్బర్ స్టాంప్‌గా కుదించింది’’ అని మునీర్ మండిపడ్డారు.

రాజకీయ జోక్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, యూనివర్సిటీల ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్, తాను ఛాన్సలర్ పదవిని చేపట్టేందుకు వీలుగా యూనివర్సిటీల చట్టాలను సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్రాసిన లేఖలో సూచించారు.

 
ముఖ్యమంత్రికి విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా అధికారాన్ని కల్పిస్తూ చట్టాలను సవరించేందుకు ఆర్డినెన్స్‌ను తెస్తే తక్షణమే సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని గవర్నర్ విజయన్‌కు గట్టి పదాలతో కూడిన లేఖలో తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రాష్ట్రంలోని సీపీఎం  నేతృత్వంలోని ప్రభుత్వం అత్యున్నత విద్యాసంస్థల ఛాన్సలర్‌గా తన అధికారాన్ని నిర్వీర్యం చేస్తూ యూనివర్సిటీల వ్యవహారాలను నిర్వహిస్తున్న తీరుతో కలత చెంది గవర్నర్ లేఖ రాశారని వారు తెలిపారు. 
 

ఇటీవల కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ గోపీనాథ్ రవీంద్రన్‌ను మరో నాలుగేళ్ల పాటు తిరిగి నియమించడం, యూనివర్సిటీ చట్టానికి సవరణను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సవరణ ద్వారా యూనివర్సిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను నియమించే ఛాన్సలర్ గా గవర్నర్ కు గల అధికారాన్ని తొలగించారు.

ట్రిబ్యునల్ నియామకంలో హైకోర్టును సంప్రదించేందుకు ఛాన్సలర్‌కు అధికారమిచ్చే క్లాజును కూడా తొలగించడంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శంకరాచార్య సంస్కృత యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఒకే ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయడాన్ని ఖాన్ నిరసించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.