చైనా బీఆర్ఐకు పోటీగా ఐరోపా గ్లోబ‌ల్ గేట్‌వే

అంతర్జాతీయంగా ఆర్ధిక ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చైనాను వాణిజ్యపరంగా కట్టడి చేసేందుకు ఐరోపా యూనియన్  (ఈయూ) వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నది.  అంత‌ర్జాతీయ వాణిజ్యాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి చైనా చేప‌ట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప‌థ‌కానికి ధీటుగా గ్లోబల్  గేట్‌వే పేరుతో పెద్దఎత్తున నిధులు సమకూర్చేందుకు సిద్దపడుతున్నది.
మౌలిక వ‌స‌తుల రంగంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో వచ్చే ఆరేళ్లలో  పెట్టుబ‌డుల‌కు 340 బిలియ‌న్ల డాల‌ర్ల (300 బిలియ‌న్ల యూరోలు) స‌మకూర్చ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈయూ స‌భ్య‌దేశాలు, ఈయూ ఆర్థిక, జాతీయాభివృద్ధి సంస్థ‌ల నుంచి ఈ నిధులు సేక‌రిస్తామ‌ని తెలిపింది.
ఈయూ త‌న గ్లోబ‌ల్ గేట్ వే పధకంలో చైనా చేప‌ట్టిన దీర్ఘ‌కాలిక అంత‌ర్జాతీయ మౌలిక వ‌స‌తుల వ్యూహం ఊసే ఎత్తలేదు. కానీ ఈయూ చీఫ్ ఉర్సులా వొన్ డీర్ లెయెన్ మాట్లాడుతూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన ప్ర‌ధాన పెట్టుబ‌డుల‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను రూపొందించుకోవాల‌ని పిలుపునిచ్చారు.
అయితే, ఈ  నిధుల‌ను స‌భ్య దేశాలు మాత్ర‌మే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కీం ల‌క్ష్య సాధ‌న‌కు అవ‌స‌ర‌మైతే అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి నిధులు సేక‌రించ‌డానికి ప్ర‌ణాళిక అవ‌స‌రం అని ఈయూ భావిస్తున్న‌ది.
బెటర్ కనెక్టివిటీ కోసం చైనా పెట్టుబడులు 
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల‌తో బెట‌ర్ కనెక్టివిటీ కోసం బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ అనే స్కీం పేరిట చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని ప్రారంభించారు. 2020లో 22.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో క‌లిపి చైనా ఇప్ప‌టి వ‌ర‌కు 139.8 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. 

బీఆర్ఐలో భాగంగా ఆసియా, యూర‌ప్‌, ఆఫ్రికా ఖండాల మ‌ధ్య స‌ముద్ర‌, రోడ్డు మార్గాల్లో మౌలిక వ‌స‌తుల‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ మూడు ఖండాల్లో వాణిజ్యం, అభివృద్ధి కోసం చైనాకు భాగ‌స్వామ్య దేశాలు ల‌భించాయి. ట్రేడ్‌, డెవ‌ల‌ప్‌మెంట్, కనెక్టివిటీ పేరిట పేద దేశాల‌ను చైనా ప్ర‌లోభ పెడుతుంద‌ని పాశ్చాత్య దేశాలు విమ‌ర్శిస్తుంటాయి.

అభివృద్ధి చెందున్న దేశాల‌కు భారీ రుణాలివ్వ‌డంతోపాటు ఆ దేశంలోని ప్రాజెక్టుల‌కు రహస్య టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి.  ఇత‌ర‌దేశాల‌తో చైనా కాంట్రాక్ట్ నిబంధ‌న‌లు మాన‌వ‌త్వ‌, కార్మిక‌, ప‌ర్యావ‌ర‌ణ హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు చెలరేగుతున్నాయి.

కార్నివాల్‌లో జూన్‌లో జ‌రిగిన జీ-7 కూట‌మి దేశాల స‌ద‌స్సు జరిగిన త‌ర్వాతే చైనా బెల్ట్ అండ్ రోడ్డ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) స్కీంకు సంపన్న దేశాలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించడం ప్రారంభించాయి. ఈ క్ర‌మంలోనే ఈయూ గ్లోబ‌ల్ గేట్ వే వ్యూహం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2013-18 మ‌ధ్య బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ స్కీంకు త‌మ డెవ‌ల‌ప్‌మెంట్ ఎయిడ్ చేరువ‌లోకి వ‌చ్చింద‌ని ఈయూ క‌మిష‌న‌ర్ జుట్టా ఉర్పిలైనెన్ చెప్పారు.