ఐదేండ్ల‌లో 25 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీక‌ర‌ణ‌

వ‌చ్చే ఐదేండ్ల‌లో మ‌రో 25 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు కేంద్ర పౌర విమానయాన‌శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని చెప్పారు. 

ఎన్ఎంపీలో భాగంగా ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ఉన్న‌25 విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటీక‌రిస్తారు.2022 నుంచి 2025 వ‌ర‌కు ప్రైవేటీక‌రించ‌నున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో భువ‌నేశ్వ‌ర్‌, వార‌ణాసి, అమృత్‌స‌ర్‌, త్రిచి, ఇండోర్‌, రాయిపూర్‌, కాలిక‌ట్‌, కొయంబ‌త్తూర్‌, నాగ్‌పూర్‌, మ‌దురై, సూర‌త్‌, రాంచీ, జోద్‌పూర్‌, చెన్నై, విజ‌య‌వాడ‌, వ‌డోద‌ర‌, భోపాల్‌, తిరుప‌తి, హుబ్లీ, ఇంపాల్‌, అగ‌ర్త‌ల‌, ఉద‌య్‌పూర్‌, డెహ్రాడూన్‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం విమానాశ్ర‌యాలు ఉన్నాయి.

2018-19, 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో ఏడాదిలో నాలుగు ల‌క్ష‌ల ప్ర‌యాణికుల ట్రాఫిక్ గ‌ల విమానాశ్ర‌యాల‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యించింది.  పార్ల‌మెంట్‌లో మంత్రి వీకే సింగ్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిన 2020లో 137 విమానాశ్ర‌యాల్లో నాలుగు మాత్ర‌మే లాభాలు గ‌డిస్తున్నాయి.

 కండాలాలో 0.11 కోట్లు, కాన్పూర్ చకేరి 6.07 కోట్లు, బ‌రేలీ 68 ల‌క్ష‌లు, పోర్‌బంద‌ర్ విమానాశ్ర‌యం ప‌రిధిలో 1.54 కోట్ల మంది ట్రాఫిక్ ఉంద‌ని మంత్రి వీకే సింగ్ చెప్పారు. మిగ‌తావ‌న్నీ భారీ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయ‌ని తెలిపారు.