అతి శ‌క్తివంత‌మైన మ‌హిళ‌గా నిర్మలా సీతారామ‌న్‌

ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ ప‌త్రిక వెల్లడించింది. ఈ 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో నిర్మ‌లా 37వ స్థానంలో ఉండ‌గా.. అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌ రెండో స్థానంలో నిలిచారు. అత్యంత శక్తివంతమైన మహిళగా మొద‌టి స్థానంలో అమెరికాకు చెందిన‌ మెకెంజీ స్కాట్ నిలిచారు. 

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ 5వ స్థానం పొందారు. అయితే గ‌త సంవ‌త్స‌రం నిర్మలా సీతారామన్ ఇదే 41 స్థానంలో ఉండగా.. ప్ర‌స్తుతం నాలుగు స్థానాలుపైకి ఎగ‌బాక‌డం గ‌మ‌నార్హం. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. 

మ‌రోవైపు భార‌తదేశం నుంచి నైకా సంస్థ వ్యవస్థాపకురాలు, సిఇఓ  ఫల్గుణి నాయర్ 88వ స్థానంలో నిలిచారు. ఆమె ప్ర‌స్తుతం భారతదేశం ఏడవ మహిళా బిలియనీర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్‌ ర్యాంకింగ్స్‌లో ఇతర భారతీయ వ్యాపారవేత్తలు రోషిణి నాడార్ (52), కిరణ్ మజుందార్-షా (72) స్థానంలో నిలిచారు.

మన దేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మల సీతారామన్ ఈ జాబితాలో 2019లో 34వ స్థానంలోనూ, 2020లో 41వ స్థానంలోనూ, 2021లో 37వ స్థానంలోనూ నిలిచారు.  అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది.

ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈఓలు ఉన్నారు. వీరు 3.3 ట్రిలియన్ల డాలర్ల రెవిన్యూను పర్యవేక్షిస్తున్నట్లు ఈ పత్రిక తెలిపింది. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. దాతృత్వంగల మహిళ మెకెంజీ స్కాట్ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ రెండో స్థానాన్ని, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.  బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కూడా ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల్లో ఒకరుగా ఈ జాబితాలో గుర్తింపు పొందారు.