సరిగ్గా ఐదేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసి కొత్తగా ప్రవేశ పెట్టిన రూ 2,000 నోట్లను ఇప్పుడు చెలామణిలో నిలిపివేశారు. నల్లధనం ఆట కట్టించేందుకు, ఉగ్రవాదులకు నిధుల అందకుండా చూసేందుకు 2016 నవంబర్ 8 అర్ధరాత్రి అర్ధంతరంగా కేంద్రం పెద్ద నోట్లు రూ.1000, రూ.500 రద్దు చేసేసింది.
వాటి స్థానే కొత్తగా రూ.2000, రూ.500 నోట్లు తీసుకొచ్చింది. తదుపరి రూ.200 విలువ గల నోట్లను కూడా తెచ్చింది. అయితే రూ 2,000 నోట్లు నల్లధనంకు, ఉగ్రవాదులకు ఆలంబనగా మారుతున్నట్లు తేలడంతో గత మూడేళ్ళుగా కొత్తగా నోట్లు ముద్రించడం నిలిపివేశారు.
ఈ సంగతి స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. 2018-19 తర్వాత కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసినట్లు వెల్లడించారు. 2018 మార్చి నాటికి మొత్తం చలామణీలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్లు 3.27 శాతం అయితే, ఇప్పుడు (నవంబర్ 2021) 1.75 శాతానికి పడిపోయిందని రాజ్యసభలో సభ్యుల రాతపూర్వక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పంకజ్ చౌదరి తెలిపారు.
2018 మార్చి 336.3 కోట్ల రూ.2000 నోట్లు చలామణిలో ఉంటే, ఇప్పుడవి 223.3 కోట్లకు పడిపోయాయని పేర్కొన్నారు. ఆర్బీఐతో సంప్రదించిన తర్వాత నగదు లావాదేవీలపై ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకునోట్లను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఆర్థిక వృద్ధిరేటు, వడ్డీరేట్ల స్థాయితోపాటు పలు సూక్ష్మ ఆర్థిక అంశాలపై కరెన్సీకి డిమాండ్ ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి వల్ల కరెన్సీకి డిమాండ్ వచ్చిందని పేర్కొన్నారు.
కరెన్సీ చలామణిలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 2019-20లో జీడీపీలో 12 శాతం కరెన్సీ చలామణి జరిగితే, 2020-21లో 14.5 శాతానికి పెరిగింది. కానీ నవంబర్‌లో 7.9 శాతానికి పడిపోయిందని పంకజ్ చౌదరి చెప్పారు.
More Stories
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?