భార‌త్ ల‌క్ష్యాల‌కు స‌వాల్ విసురుతున్న చైనా

భార‌త్ త‌న వ్యూహాత్మ‌క ల‌క్ష్యాల‌ను అందుకునే దారిలో చైనా సుదీర్ఘ స‌వాల్‌గా నిలుస్తోంద‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ వివేక్ రామ్ చౌద‌రీ తెలిపారు. చైనా త‌న వైమానిక ద‌ళ మౌళిక‌స‌దుపాయాల‌ను పెంచుకుపోతున్న తీరు ఆధారంగా ఆ దేశ దూకుడును అర్థం చేసుకోవ‌చ్చు అని ఆయ‌న పేర్కొన్నారు. 
 
పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ త‌న సైనిక స‌త్తాను పెంచుకుంద‌ని చెప్పారు. భార‌త వైమానిక దళం కూడా వేగంగా ఆధునీక‌ర‌ణ చెందాల‌ని, త‌న ద‌ళాల‌ను మ‌రింత విస్త‌రింప‌చేయాల‌ని, స్వ‌దేశీ త‌యారీ కేంద్రాల సామ‌ర్ధ్యాన్ని పెంచాల‌ని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌న‌పై అన్ని ర‌కాల దాడులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని  ఆయన హెచ్చరించారు
ఆర్థిక‌మైన అంశాల నుంచి దౌత్య‌ప‌ర‌మైన అంశాల‌తో పాటు సైనిక దాడులు కూడా జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. చైనా గుత్తాధిప‌త్యం, ట్రాప్ చేసే విధానాలు భారత్ కు కొత్త అవ‌కాశాలను క‌ల్పిస్తాయ‌ని ఆయన భరోసా వ్యక్తం చేసారు. 
 
దీంతో ఇండోప‌సిఫిక్ ప్రాంతంలో భార‌త వాణిజ్య‌, ర‌క్ష‌ణ బంధాలు బ‌లోపేతం అవుతాయ‌ని చెప్పారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కొత్త ఆయుధాల‌ను సేకరిస్తోంద‌ని, వైమానిక ర‌క్ష‌ణ సామ‌ర్ధ్యాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్న‌ట్లు కూడా ఆయ‌న చెప్పారు. 
 
జీవాయుధ యుద్ధం గురించి బిపిన్ రావత్ హెచ్చరిక 
 
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మంగ‌ళ‌వారమే ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి స‌న్న‌ద్దంగా ఉండాల‌న్నారు. అయితే ఆ వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజు.. రావ‌త్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ కూలింది.  
 
మంగ‌ళ‌వారం ప్యానెక్స్‌-21 ప్రారంభోత్స ఈవెంట్‌లో పాల్గొన్న త్రివిధ‌ద‌ళాధిప‌తి రావ‌త్ మాట్లాడుతూ.. ఓ కొత్త విష‌యాన్ని హైలెట్ చేయాల‌నుకున్నాన‌ని, కొత్త త‌ర‌హా యుద్ధానికి స‌న్న‌ద్దం కావాల‌ని, ఒక‌వేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్న‌ట్లు గ‌మ‌నిస్తే, అప్పుడు మ‌రో దానికి త‌గిన‌ట్లు బ‌లోపేతం కావాల‌ని హెచ్చరించారు. 
 
వైర‌స్‌లు, వ్యాధులు త‌ట్టుకునే రీతిలో మ‌న దేశం సంసిద్ధం కావాల‌ని సీడీఎస్ రావ‌త్ తెలిపారు. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, భ‌విష్య‌త్తులో వైర‌స్‌లను ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్త‌మై ఉండాల‌ని పేర్కొన్నారు. ఏ దేశంలోనైనా ఇలాంటి స‌మ‌స్య వ‌స్తే, అప్పుడు ఒక‌ర్ని ఒక‌రు ఆదుకోవాల‌ని సూచించారు.