కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్‌లో బిపిన్ రావ‌త్

త‌మిళ‌నాడులోని కునూరులో కుప్ప‌కూలిన హెలికాప్ట‌ర్‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ఉన్న‌ట్లు వాయుసేన ప్ర‌క‌టించింది. రావ‌త్ కుటుంబ స‌భ్యులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మొత్తం 14 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఆర్మీ హెలికాఫ్ట‌ర్‌ బుధ‌వారం న‌లూర్ నుంచి వెల్లింగ్ట‌న్‌కు వెళుతుండ‌గా కూనూర్ వ‌ద్ద కుప్ప‌కూలింది. హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది.  నీల‌గిరి కొండ‌ల్లో కుప్ప‌కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆయ‌న మ‌ధులికా రావ‌త్ కూడా ప్ర‌యాణించారు.
బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు బ్రిగేడియ‌ర్ ఎల్ఎస్ లిడ్డ‌ర్, లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హ‌ర్జింద‌ర్ సింగ్‌, ఎన్‌కే గురుసేవ‌క్ సింగ్‌, ఎన్‌కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్‌, బీ సాయి తేజ‌, హ‌వ‌ల్దార్ స‌త్పాల్ ఉన్నారు.
 
ప్ర‌మాదంపై త‌క్ష‌ణ విచార‌ణ‌కు వాయుసేన ఆదేశించింది. అయితే ప్ర‌మాద‌స్థ‌లి నుంచి రెండు మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు మృత‌దేహాలు కూడా 80 శాతం కాలిపోయాయి.త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు, సులూరు మ‌ధ్య ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెలికాఫ్ట‌ర్ కూలిన స‌మ‌యంలో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ‌మంచు అలుముకుంది.
 
త‌మిళ‌నాడులో కుప్ప‌కూలిన డిఫెన్స్ హెలికాఫ్ట‌ర్ ఘ‌ట‌నపై కేంద్ర క్యాబినెట్ అత్య‌వ‌స‌రంగా స‌మావేశమైంది. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ వివ‌రించారు. ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని ఉన్న‌త‌స్ధాయి స‌మీక్ష నిర్వ‌హించారు.
 
ఈ ప్ర‌మాదంలో ఆర్మీ హెలికాప్ట‌ర్ తునాతున‌క‌లైంది. భారీ ప్ర‌మాదానికి అక్క‌డున్న భారీ వృక్షాలు సైతం నేల‌కొరిగాయి. వృక్షాలు కూడా పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. హెలికాప్ట‌ర్ భాగాలు ముద్ద‌గా మారాయి. అస‌లు ఏ భాగం ఎక్క‌డుందో కూడా గుర్తించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.
 
హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌పై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని ఆయ‌న అధికారుల‌కు సూచించారు. స‌హాయ కార్య‌క్ర‌మాల్లో వాయుసేన‌, సైనిక సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదానికి గురైన హెలికాఫ్ట‌ర్‌లో సీడీఎస్ బిపిన్ రావ‌త్ ఉన్నార‌ని విన‌డం షాక్‌కు గురిచేసింద‌ని చెప్పారు. 
బుధ‌వారం ఉద‌యం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబ‌త్తూరులోని సూలూరు ఎయిర్‌బేస్‌కు సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ఆయ‌న భార్య మ‌ధులికా రావ‌త్ స‌హా 9 మంది ఆర్మీ ఆఫీస‌ర్లు బ‌య‌ల్దేరారు. సూలూరు ఎయిర్‌బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్‌కు ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో బిపిన్ రావ‌త్ దంప‌తులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీస‌ర్లు బ‌య‌ల్దేరారు. 
 
ఇక కూనూరు ఎయిర్‌బేస్‌లో మ‌రో 5 నిమిషాల్లో హెలికాప్ట‌ర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాప‌ర్ కుప్ప‌కూలిపోయింది. స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన‌ట్లు ఆర్మీ అధికారులు ధృవీక‌రించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా మ‌ధ్యాహ్నం 1:50కి ట్వీట్ చేసింది. 
 
 ఎంఐ 17 హెలికాప్ట‌ర్ ను చాన్నాళ్ల నుంచి వైమానిక ర‌క్ష‌ణ ద‌ళం ఉంది. వీ5 వ‌ర్షెన్ చాలా అత్యాధునిక‌మైంది. ఈ వేరియంట్ హెలికాప్ట‌ర్‌తో ప్ర‌మాదాలు కూడా చాలా త‌క్కువ‌గా జ‌రిగాయి. రాత్రిపూట కూడా ఈ హెలికాప్ట‌ర్ గాలిలో ఎగురుతుంది.
 
వచ్చే జనవరిలో రావత్ పదవీ విరమణ 
భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా బిపిన్ రావత్ 2019, జ‌న‌వ‌రిలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. త్రివిధ దళాల(వాయుసే, ఆర్మీ, నౌకాద‌ళం) తొలి అధిపతిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన బిపిన్ రావ‌త్ మూడేండ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఇక ఆయ‌న ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది. అంత‌లోనే ఈ ప్ర‌మాద ఘ‌ట‌న జ‌ర‌గ‌డం చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

మూడేళ్లపాటు ఆర్మీ చీఫ్‌గా పని చేసిన బిపిన్ రావత్.. 2019, జ‌న‌వ‌రిలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. అంతకు ముందే ఆయన్ను దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలను ఆయన యూనిఫాం మీద పొందుపరిచారు. మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ వ్యవహరిస్తున్నారు.