ఇబ్బందిగా ఉంటె అబ్దుల్లా, ముఫ్తీ దేశం వీడండి!

జ‌మ్మూ కశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రులు ఫ‌రూక్ అబ్దుల్లా, మెహ‌బూబా ముఫ్తీపై ఆరెస్సెస్ సీనియ‌ర్ నేత ఇంద్రేశ్ కుమార్ తీవ్రంగా మండిప‌డ్డారు. ఎన్సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా వ్యాఖ్య‌ల‌పై ఆగ్రగాం వ్యక్తం చేశారు. 

”భార‌త్ లో ఉండ‌డం ఇబ్బందైతే… నిర‌భ్యంతరంగా ఆయ‌న భార‌త్‌ను వీడిపోవ‌చ్చు. ఆయ‌న‌కు ఏ దేశం సౌక‌ర్య‌వంతమో… ఆ దేశానికి వెళ్లిపోవ‌చ్చు.” అంటూ ఇంద్రేశ్ తీవ్ర వ్యాఖ్య‌ల‌తో హితవు చెప్పారు.  ఫ‌రూక్ అబ్దుల్లాకు శాంతిపై ఏమాత్రం న‌మ్మ‌కం లేద‌ని, హింస‌నే ఆయ‌న న‌మ్ముకున్నార‌న్న విష‌యం ఆయ‌న వ్యాఖ్య‌ల ద్వారా రూఢీ అవుతోంద‌ని ఇంద్రేశ్ దుయ్య‌బ‌ట్టారు.

కేంద్రం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ఎలాగైతే.. ఉద్య‌మాలు చేశారో, క‌శ్మీర్ ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తికి, ప్ర‌త్యేక రాష్ట్ర హోదాకు అలాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఫ‌రూక్ అబ్దుల్లా  పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి, పీడీపీ అధినేత మెహ‌బూబా ముఫ్తీపై కూడా ఇంద్రేశ్ కుమార్ మండిప‌డ్డారు. జ‌మ్మూ క‌శ్మీర్ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కేంద్రం కాల‌రాస్తోందంటూ ఆమె ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను ఇంద్రేశ్ తిప్పి కొత్తగారు.

అబ‌ద్ధాలు చెప్ప‌డం మెహ‌బూబా ముఫ్తీకి ఫ్యాష‌న్ అయిపోయింద‌ని ఆయ‌న‌ దెప్పిపొడిచారు. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని దెబ్బ‌తీసే విధంగా మాట్లాడ‌టం ఆ ఇరువురు నేత‌లు మానుకోవాల‌ని, దేశ స‌మైక్య‌త‌కు పాటుప‌డాల‌ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ సూచించారు.