నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎయిర్‌‌పోర్ట్‌లో చుక్కెదురు

శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మస్కట్ వెళ్లేందుకు ఎయిర్‌‌పోర్టుకు వెళ్లిన ఆమెను విమానం ఎక్కకుండా నిలువరించారు.

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. అయితే మస్కట్ వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం ఆమె ముంబై ఎయిర్‌‌పోర్టుకు చేరుకోగా  లుకౌట్‌ నోటీసులు ఉండడంతో దేశం విడిచి వెళ్లకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించినట్లు తెలుస్తోంది. 

అయితే విమానం ఎక్కకుండా అడ్డుకున్నప్పటికీ జాక్వెలిన్‌ను అరెస్టు మాత్రం చేయలేదని, దీంతో ఆమె ముంబైలోని తన ఇంటికి వెళ్లిపోయిందని సమాచారం అందుతోంది.

కాగా, రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారిస్తున్న ఈడీ.. ఆ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా చార్జిషీటులో పేర్కొంది. ఈ కేసులో అతడి భార్య లీనా పాల్, బాలీవుడ్ యాక్టర్స్ జాక్వెలిన్, నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. వీరందరికీ ఈడీ నోటీసులు జారీ చేసి పలుమార్లు ప్రశ్నించింది. 

సుఖేష్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమెకు సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బహుమతులు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.