‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిలో ఉన్నది పొగరా? విగరా?

డా. వడ్డి విజయసారధి
సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు. నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగరు లేకుంటే ఆ ‘విగరు’ (ఇది ఇంగ్లీష్ పదం) రాణించదు. అతడు నా కంటే నాల్గయిదేళ్లు చిన్నవాడు. నాకెప్పుడూ గౌరవలోపం చేయలేదు గాని, సినిమాల్లోకి వెళ్లిన తరవాత అతనితో మాట్లాడేటప్పుడు అతన్ని నేను ‘శాస్త్రి గారూ’ అనేవాడిని.
 
‘అదేమిటండీ, మీరు నన్ను గారూ అనటమేమిటి?’ అని అనాలి గదా! అనలేదు. తగుదునమ్మా అంటూ ఆ మర్యాదను మౌనంగా స్వీకరించాడు. అప్పుడే అనుకున్నాను. ఇతని పొగరేమీ తగ్గలేదే అని. అసలు అతనికి పొగరు ఎక్కువ అనే భావం ఎప్పడు ఏర్పడిందనుకున్నారు?
 
1978-79 లో విజయవాడలో ఒక పెద్ద కథా రచయితల సమ్మేళనం జరిగింది. హేమాహేమీలు, చేయి తిరిగినవారూ, పేరు మోసినవారూ వచ్చారు. ఇతడూ వచ్చాడు. బహిరంగసభ లాంటి కార్యక్రమాల్లో మంచి గీతాలను పాడించాలనుకున్నారు నిర్వాహకులు.
 
ఇతడు పాడదలుచుకున్న పాట, పాడేతీరూ బాగుండటంతో రెండవరోజు ముగింపు సభలో ఇతనితో పాడించా లనుకున్నారు. ఆ సమయం వచ్చేసరికి సభా సంచాలనం చేస్తున్న వ్యక్తి ఇతనికంటే ఓ పదిహేనేళ్లు పెద్దవాడు వేదిక వెనుకకు వచ్చి, “ఆ పాటలుపాడే కుఱ్ఱవాడేడీ?” అని నన్ను అడిగారు.
 
ఇతడు ఆమాట విని “వయస్సులో మేజర్ని, పోస్టలు డిపార్టుమెంటులో ఉద్యోగినీ అయిన నన్ను కుఱ్ఱవాడని అగౌరవ పరుస్తారా? నేను పాడను”. అని వెళ్లిపోయాడు. అదిగో అప్పట్నించి నేను గట్టిగా గుర్తుపెట్టుకున్నా. ఇతనికి పొగరెక్కువ. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని.
అసలు అతడికి అంత పొగరు ఎలా వచ్చిందో… అది కూడా కాలక్రమాన నాకు తెలిసింది. వాళ్ల నాన్నగారి గురించి ఒక గొప్ప మంచిపుస్తకం వ్రాసి ఆ అన్నదమ్ములు అచ్చేయించారు. అందులో ఇతడే వ్రాశాడు. ఏదన్నా పనుండి వాళ్ల నాన్నగారు ఇతడిని, ఇతని తమ్ముళ్లనీ పిలిచినా, ఆ పని అయిపోగానే, “పోయి ఆడుకోండి!” అనేవారట!
 
అంతేకాని “బుద్ధిగా కూర్చొని చదువుకోండర్రా!” అని ఎప్పుడూ అనలేదట! అర్థమైందా, యోగిగారి పెంపకం ఎలా ఉండేదో! ఇంతటి పొగరుబోతు ఒకసారి కష్టపడి నాకు పాదాభివందనం చేశాడు. నేను నిశ్చేష్టుడ నయ్యాను. “ఇదేమిటయ్యా?” అని ధైర్యం తెచ్చుకొని ఏకవచనప్రయోగం చేస్తూ అడిగాను.
అతడు చెప్పిన మాటలు చెప్పడానికి ముందు ఆ సందర్భం కొంచెం వివరంగా చెప్పాలి. యోగిగారు కాగితంమీద వ్రాశారో లేదో తెలియదుగాని ‘మావాడి బాగోగులు నువ్వు చూడా’లని సత్యారావు మాస్టారితో అన్నారట. అప్పటి నుండి సత్యారావు గారి పెద్దరికం ఆ అన్నదమ్ముల దగ్గర సాగుతోంది.
ఆ సత్యారావు మాస్టారికి మా ఆఖరి చెల్లెలి నిచ్చాం. ఆ మేస్టారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, శాస్త్రిగారి కుటుంబ మంతా హాజరయ్యే ప్రయత్నం చేస్తారు. మాస్టారి రెండో కుమారుని వివాహం ముందు నిశ్చయతాంబూలాలు పుచ్చుకొనే కార్యక్రమం విజయవాడలో జరుగుతున్నది. అక్కడ నేను మా పెద్ద చెల్లెలితో మాట్లాడుతూ ఉండగా శాస్త్రిగారు అటు వచ్చారు. నేను మా చెల్లెల్ని పరిచయం చేశాను.
అతడు వంగి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆమె పాపం పల్లెటూరి మనిషి, కంగారుపడిపోయింది “ఇదేమిటండీ?” అంటూ. అతడు తాపీగా వివరించారు. “మీ చెల్లెలు శ్యామలగారు మాకు వదిన గారు. మా అన్నగారికి, వదినగారికీ పాదాలకు మ్రొక్కి ఆశీస్సులు పొందటం మాకు ఆనవాయితీ. మీరు ఆమెకంటే పెద్దవారు కదా!”. తర్కం బాగానే ఉంది! అనుకున్నాను.
మా కుశల ప్రశ్నలు పూర్తయి సెలవు తీసుకుందా మనుకున్నప్పుడు అతడు మరోసారి వంగి నాకు పాదాభివందనం చేశాడు. ‘ఇదేమిటయ్యా’ అని అడిగితే, “మీరు వారిద్దరికంటే పెద్దకదా!” అని అతని సమాధానం. ఏ మనిషి జీవితమూ సరళరేఖగా ఉండదు. సందర్భాలనుబట్టి, లభించే గురువులను బట్టి, తటస్థపడే స్నేహితులనుబట్టి జీవిత గమనంలోనూ, వ్యవహార శైలిలోనూ మార్పులు వస్తుంటాయి. శాస్త్రిగారిలో మార్పులు రావడానికి ఎందరు కారణమో వారందరూ నాకు తెలియదు. తెలుసుకోవటం సాధ్యం కాదు కూడాను.
 
కాని ముగ్గురిని ఇక్కడ ప్రస్తావించటం అవసర మనుకొంటున్నాను. మొదటివ్యక్తి అతని ధర్మపత్ని పద్మావతి. వారి ఇంటికి మొదటిసారి వచ్చేవారిని కూడా ఆదరించే స్వభావం ఆమెలో ఉంది. కవిగారితో ఇంటర్వ్యూ ఒక పట్టాన దొరకదు గదా. వచ్చినవారు ఈ లోపల ఏమిచేయాలి? ఆ సమస్య తలెత్తకుండా, వచ్చినవారిని ఆదరిస్తుంది.
ఆ స్వభావం క్రమక్రమంగా శాస్త్రిగారిలోనూ కొంతమార్పు తెచ్చి ఉంటుంది. రెండవవారు శివానందమూర్తి గారు. వారు ఏ విధమైన భేషజమూ చూపకుండా మాట్లాడే పద్ధతి మనల్ని చకితుల్ని చేస్తుంది. వారి ప్రభావం పైకెదుగుతున్న కవిని ‘దిగిరాను, దిగిరాను …’ అంటూ పైకెక్కి కూర్చోబెట్టకుండా, చెట్టు ఎంతగా ఆకాశంలోకి ఎదిగినా, వేళ్లుమాత్రం భూమిలోనే ఉండాలి అని అర్థం చేయించి ఉంటారు. మూడవవ్యక్తి మా బావగారు సత్యారావు మాస్టారు.
శాస్త్రి సోదరులకు నేను నేరుగా తెలిసినవాడినే అయినా, ఇంట్లో మిగిలినవారి ముందు నేను మాస్టారి బావమరిదినే, లేదా శ్యామల గారి అన్నయ్యనే. నా పట్ల వ్యవహారం లోనే గాక సమాజంలోని అనేక మందితో సంబంధాలు నెరపటంలో మాస్టారు శ్రమ తీసుకోవలసి వచ్చేది.
శ్రీ శారదా ధామంలో ఒక కార్యక్రమానికి మాస్టారు వెంట ఉండి తీసుకు వచ్చారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామికూడా ఆరోజు కార్యక్రమంలో ఉన్నారు. జాగృతి భవనంలో నిర్వహించ దలిచిన కార్యక్రమానికి మాస్టారిద్వారా మాట్లాడించినా, శాస్త్రిగారు రాలేకపోయారు.
కాగా కర్తవ్య నిర్వహణలో దృఢంగా నిలబడి వర్షంలో తడుస్తూ శాస్త్రిగారు ఉపన్యసించిన సందర్భంలో ఆశ్చర్యపోవటం నావంతు అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాతావరణం కలుషితమౌతున్నవేళ, శ్రీ ఎంవి ఆర్ శాస్త్రి చొరవ తీసుకొని లలితకళా తోరణంలో ఒక కార్యక్రమం ఏర్పరిచారు.
ఆ కార్యక్రమం చూసిన తర్వాత శాస్త్రిలో ఉన్నది ‘విగరే గాని పొగరు కాదు’ అనే అభిప్రాయం కలిగింది నాకు. శాస్త్రిగారి కవిత్వం గురించి ఒక్క మాటచెప్పేసి నా కథనం ముగిస్తాను. దాశరథి, సినారే వంటివారు ముందు కవులుగా ప్రసిద్ధులు. సినిమాలకు పాటలు వ్రాసి సంపాదనాపరు లయ్యారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, పింగళి నాగేంద్రరావు , వేటూరి వంటివారు సందర్భానికి తగిన పాట కూర్చటంలో చేయి తిరిగినవారు.
 
సినిమాలవల్ల ప్రఖ్యాతులైనా, సినిమాలతో ముడిపడని సాహిత్య వ్యాసంగం వారికి ఉంది. వారికి భిన్నంగా చిన్నవయస్సులో సినిమారంగంలో అడుగుపెట్టిన కవి సిరివెన్నెల. ఇటువంటివారు అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆరాటంలో పూర్తిగా చెడిపోడానికి, దిగజారిపోడానికీ ఎంతైనా అవకాశముంది.
 
కాని అతని అదృష్టం, మన అదృష్టం! దిగజారిపోకుండా నిలద్రొక్కుకోవటమేగాక, తెలుగు సినిమా పాటస్థాయిని పెంచటం నిజంగా అభినందించదగిన విషయం. తన మాట వినేవారిని యువతరం వారిని పదిమందిని ఈ పరిశ్రమలో ప్రవేశింపజేయటమూ చిన్న విషయం కాదు.
 
ఈ రెండు విషయాలలో అతడిని ప్రత్యేకించి అభినందించ వలసి ఉంది. (అయిష్టంగానే అయినా కొందరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పాత్రను ఈ సందర్భంలో పేర్కొనటం గమనార్హం.) అతడు సంపాదించుకున్న విశిష్టస్థానం నంది పురస్కారాలకు,ఇంకా ఇతరేతర పురస్కారాలకు, పద్మ పురస్కారాలకు కూడా అతీతమైంది. పాటకు వన్నెతెచ్చిన వ్యక్తిగానేగాక, పద్మశ్రీ పురస్కారానికీ వన్నెతెచ్చిన వ్యక్తిగా కూడా ఇతడు గుర్తుంచుకోబడతాడని నా విశ్వాసం.
 
ఫోటో : ‘గుమ్మటాలు’ పుస్తకావిష్కరణ సభలో శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పక్కన పుస్తక రచయిత డా. వడ్డి విజయసారథి, ఎమ్మెల్సీ మాధవ్, చివర ఉన్న సత్యారావు మాస్టారు