కాంగ్రెస్ కు 300 సీట్లు రావు… ఆర్టికల్ 370 తీసుకు రాలేదు

2024లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ 300 సీట్లు గెల్చుకొనే అవకాశాలు తనకు కనిపించడం  లేదని, పార్లమెంట్ లో మెజారిటీ ఉంటేగాని బిజెపి రద్దుచేసి ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం సాధ్యం కాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ  జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాబీ నబి ఆజాద్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న బిజెపి ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొచ్చే అవకాశం లేదని, కాంగ్రెస్ కు కూడా ఆ బలం లేనప్పుడు దాని గురించి మాట్లాడి, ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. అందుకనే తాను ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం లేదని, కేవలం జమ్మూ, కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని మాత్రమే కోరుతున్నానని ఆయన వివరణ ఇచ్చారు. 

“మనకు స్వంతంగా 300 మంది ఎంపీలు [ప్రభుత్వ ఏర్పాటుకు] ఎప్పుడు ఉంటారు? కాబట్టి, 2024లో మనం 300 మంది ఎంపీలను పొందవలసి ఉంటుంది. అందుకనే [ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తానని] నేను వాగ్దానం చేయలేను. దేవుడు మనకు 300 మందిని [ఎంపీలు] ఇవ్వాలని కోరుకొందాము. కానీ ప్రస్తుతం నాకు అటువంటి అవకాశం కనిపించడం లేదు. అందుకే నేను ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేయను. ఆర్టికల్ 370 గురించి మాట్లాడకుండా ఉంటాను,” అని ఆయన స్పష్టం చేశారు. 

ప్రస్తుతం పూంచ్, రాజౌరీ పర్యటనలో ఉన్న ఆజాద్ ఇటీవల కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం అసంబద్ధం అని పేర్కొన్నారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, జమ్మూ కాశ్మీర్  అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడం తన ప్రధాన డిమాండ్ అని తెలిపారు. 

ఆయన ప్రకటనను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శిస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టకముందే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓటమిని అంగీకరించారని ధ్వజమెత్తారు. ఒమర్ విమర్శలపై ఆజాద్ స్పందిస్తూ, ఆర్టికల్ 370 రద్దు. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా  విభజించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 

“గత మూడేళ్లుగా నేను మాత్రమే పార్లమెంటులో దీని గురించి మాట్లాడుతున్నాను” అని ఆయన గుర్తు చేశారు.  “ప్రభుత్వంతో మా పోరాటం ఏమిటంటే, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు, రాజ్యాంగంలో మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని నేను చెప్పాను. అయితే అది జమ్మూ కాశ్మీర్  అసెంబ్లీ ద్వారా వస్తుంది గాని పార్లమెంటు ద్వారా కాదు అని కూడా స్పష్టం చేసాను” అని ఆజాద్ వివరించారు.