కాశ్మీర్ లో పెట్టుబడులకు పలు కంపెనీలు సిద్ధం!

జమ్ముకాశ్మీర్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు  కార్పొరేట్‌ కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో అక్కడి ప్రయివేటు భూముల్లో స్థానికులే కాకుండా ఎవ్వరైనా వ్యాపారాలు నిర్వహించేందుకు వీలు కల్పించిన నేపథ్యంలో పలు బహుళ జాతి సంస్థలు అక్కడ పాగా వేసేందుకు తహతహలాడుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే కొల్‌కతాలో గత మంగళవారం జమ్ముకాశ్మీర్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌ (జెకెటిపిఒ), సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన వాణిజ్య ప్రోత్సాహక సమావేశంలో లెఫ్టినెంట్‌ గవర్నరు మనోజ్‌ సిన్హా పాల్గన్నారు. త్వరలోనే భూ బదలాయింపునకు మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. 

ప్రయివేటు భూముల్లో వ్యాపార కార్యాకలాపాలు నిర్వహించేందుకు వీలుగా త్వరలోనే కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చేందుకు తమ యంత్రాంగం సంసిద్ధమైందని పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన నేపథ్యంలో దాదాపు రూ.51 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్య సంస్థలు మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. 

వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు భారీగా ప్రతిపాదనలు వచ్చిపడుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా మార్గదర్శకాలు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని లెఫ్టినెంట్‌ గవర్నరు మనోజ్‌ సిన్హా తెలిపారు. 2019 ఆగస్టు 5కు మునుపు జమ్ముకాశ్మీర్‌లో అనుమతించిన ప్రాంతాల్లోనే వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు వీలుండేంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక హోదాను, రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి విదితమే.