చమురు సుంకం వసూళ్లు రెట్టింపు… జీడీపీ 8.4 శాతం

పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకం రూపంలో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21)లో రెట్టింపుకు పైగా కేంద్ర ఖ‌జానాకు ఆదాయం ల‌భించింది. 2019-20లో రూ.1.78 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు ఎక్సైజ్ సుంకం రూపేణా ఆదాయం ల‌భిస్తే గ‌తేడాది అది రూ.3.72 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన రాత‌పూర్వ‌క స‌మాధానంలో చెప్పారు.

ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.20 వేల కోట్ల పై చిలుకు వెళుతుంద‌ని తెలిపారు. గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు వినియోగం త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. దీంతో భారీగా ముడి చ‌మురు ధ‌ర ప‌డిపోయింది. క‌రోనాతో వివిధ మార్గాల్లో వ‌చ్చే ఆదాయాన్ని పూడ్చుకునేందుకు కేంద్రం గ‌తేడాది రెండు ద‌ఫాలు సుంకాలు పెంచిన సంగ‌తి తెలిసిందే.

2019లో లీట‌ర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.19.98, లీట‌ర్ డీజిల్‌పై రూ.15.83. గ‌తేడాది రెండు సార్లు పెంచ‌డంతో 2020లో లీట‌ర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.32.98, లీట‌ర్ డీజిల్‌పై రూ.31.83ల‌కు చేరుకున్న‌ది. ఈ ఏడాది బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.32.90, లీట‌ర్ డీజిల్‌పై రూ.31.80ల‌కు స‌వ‌రించింది కేంద్రం.

ఇటీవ‌ల లీట‌ర్ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రిటైల్ మార్కెట్‌లో సెంచ‌రీ మార్క్ దాటటంతోపాటు ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పాయి. దీంతో నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో లీట‌ర్ పెట్రోల్‌పై రూ.5, లీట‌ర్ డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం త‌గ్గించి వేసింది. పెట్రోల్‌, డీజిల్‌ల‌పై సుంకాలు పెంచ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వ ప‌న్ను వ‌సూళ్లు పెరిగాయి.

 జీడీపీ 8.4 శాతం వృద్ధి!

క‌రోనా మ‌హమ్మారితో కుదేలైన దేశ ఆర్ధిక వ్య‌వ‌స్ధ క్ర‌మంగా పుంజుకుంటోంది. 2022 ఆర్ధిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికంలో భార‌త జీడీపీ అంచ‌నాల‌కు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి క‌న‌బ‌రిచింది. 

ఆర్ధిక కార్య‌క‌లాపాలు వేగ‌వంతం కావ‌డంతోనే జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహ‌క‌రంగా న‌మోదైంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరందుకోవ‌డం, నిత్యావ‌స‌రాలు, వ‌స్తువినిమ‌య గిరాకీ, పారిశ్రామిక‌, సేవా రంగాల్లో ఊపందుకున్న కార్య‌క‌లాపాలు కూడా వృద్ధి రేటుకు ఊత‌మిచ్చాయి. 

గ‌త ఏడాది ఇదే క్వార్ట‌ర్‌లో మ‌హ‌మ్మారి దెబ్బ‌కు లాక్‌డౌన్లు విధించ‌డంతో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం త‌గ్గింది. ఇక 2021-22 రెండో క్వార్ట‌ర్‌లో లో బేస్ ఎఫెక్ట్ కూడా అధిక వృద్ధి న‌మోదుకు దారితీసింది. మ‌రోవైపు దేశంలో రిక‌వ‌రీ రేటు ప్రోత్సాహ‌క‌రంగా ఉన్నా ధ‌ర‌ల మంట‌, అధిక వ‌డ్డీరేట్లు, జాబ్ రిక‌వ‌రీ మంద‌కొడిగా ఉండ‌టం అవ‌రోధాలుగా ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.